వందేమాతరాన్ని అవమానించిన కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు
ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ (IMC) బడ్జెట్ సమావేశాల్లో ‘వందేమాతరం’ ఆలపించే సమయంలో జరిగిన వివాదం రాజకీయంగా పెను దుమారం రేపింది. జాతీయ గీతాన్ని అవమానించారనే ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లను పోలీసులు విచారించివారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు సంప్రదాయబద్ధంగా వందేమాతరం ఆలపించడం ఆనవాయితీ. అయితే, ఇటీవల జరిగిన బడ్జెట్ సెషన్ సందర్భంగా వందేమాతరం ప్లే అవుతుండగా కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు రుబీనా ఇక్బాల్ ఖాన్, ఫౌజియా షేక్ అలీమ్ లు దానికి తగిన గౌరవం ఇవ్వలేదని, ఒకరు సభ నుండి బయటకు వెళ్లగా, మరొకరు మతపరమైన కారణాలతో నిరాకరించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ గీతాన్ని అవమానించడం రాజ్యాంగ విరుద్ధమని వారు వాదించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇండోర్‌లోని ఎంజీ రోడ్ పోలీసులు రంగంలోకి దిగి, ఇద్దరు కౌన్సిలర్లపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. వారు సభ నుండి ఎందుకు వెళ్ళిపోయారు? వందేమాతరం పట్ల వారికున్న అభ్యంతరాలేమిటి? అనే అంశాలపై పోలీసులు వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఈ వివాదం రాష్ట్ర స్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఇతర బీజేపీ నేతలు దీనిని తీవ్రంగా ఖండించారు. భారత్‌లో ఉంటూ జాతీయ గీతాన్ని గౌరవించని వారికి ప్రజా ప్రతినిధులుగా ఉండే అర్హత లేదని విమర్శించారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆత్మరక్షణలో పడింది.
భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదయ్యాయి. ఒకవేళ జాతీయ గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లు ఆధారాలు లభిస్తే, వారి కౌన్సిలర్ పదవి కూడా ముప్పులో పడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ వివాదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జాతీయ గౌరవానికి సంబంధించిన అంశాల్లో రాజకీయం తగదని కొందరు అంటుంటే, చట్టం తన పని తాను చేయాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.