గిరిజనుల ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ : వెంకయ్య నాయుడు

గిరిజనులు, ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో రాణించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గిరిజన-ఆదివాసీ’ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని, అందుకే వారి సహజసిద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులను ప్రచారం చేయడం, వారి ఆదాయ వనరులను మెరుగుపరచడం ఎంతో ముఖ్యమని చెప్పారు. గిరిజనుల వివిధ ఉత్పత్తులు, హస్తకళల సహజసిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలని సూచించారు.  ఈ-కామర్స్‌, డిజిటల్‌ వ్యాపార మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివాసీ-గిరిజన యువకులు సాంకేతికతను అందిపుచ్చుకుని, అభివృద్ధి సాధించవచ్చని, ఈ దిశగా ఆదివాసీ-గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మీరు ఒక్క అడుగు ముందుకేస్తే, మీ కోసం వంద అడుగులు ముందుకు వేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని ఆదివాసీ-గిరిజన సోదరులు గ్రహించాలని చెప్పారు. దేశ జనాభాలో ఆదివాసీలు దాదాపుగా 10 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *