సామాజిక సమతౌల్యత కోసం హిందూ కుటుంబాలు కనీసం ముగ్గుర్ని కనాలి : అలోక్ కుమార్
దేశంలో హిందూ జనాభా తగ్గి, ఇతర మతాల జనాభా పెరిగిపోతోందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ జననాల రేటు క్షీణిస్తోందని, జనాభా సంక్షోభమని అభివర్ణించారు.దేశం యొక్క జనాభా స్థిరీకరించబడాలంటే, వృద్ధి రేటు కనీసం 2.1 ఉండాలి. కేరళలో ఇది 1.7 మాత్రమే. దేశవ్యాప్తంగా సగటు పడిపోతోందని వివరించారు.ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో ఎక్కువ మంది వృద్ధులు, తక్కువ మంది యువకులు ఉండే భవిష్యత్తును ఎదుర్కొంటాం’’ అని హెచ్చరించారు. మహా కుంభమేళా వేదికగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సాధు సంతుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా అలోక్ కుమార్ మాట్లాడుతూ… పెళ్లి వయసు పెరగడమే సమస్యకు కొంత కారణమని, ఇది కుటుంబ కలహాలకు దారితీస్తోందని అన్నారు. జనాభా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మరియు సాంస్కృతిక మరియు సామాజిక సమతుల్యతను కాపాడుకోవడానికి హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని కుమార్ కోరారు.
మరోవైపు ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక.. బంగ్లాదేశ్ లో హిందువులు లేకుండా వుండాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేస్తే ఏం చేయాలో తమ వద్దా ప్రణాళికలు వున్నాయని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులను రక్షించడానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని అలోక్ కుమార్ ప్రకటించారు.