లొద్ది మల్లయ్య జాతరపై నిషేధం విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం… వెంటనే ఎత్తేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే లొద్ది మల్లయ్య జాతరపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని తెలంగాణ విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఇలా జాతరపై నిషేధం విధించడం అంటే హిందూ మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి యేటా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ నెల 17 వ తేదీ నుంచి ఈ జాతర ప్రారంభం కావాల్సి వుంది. ఈ లొద్ది మల్లయ్య జాతర జరిగే ప్రాంతం మహబూబునగర్ జిల్లా మన్ననూర్ చెక్‌పోస్టు శ్రీశైలం రోడ్డు సమీపంలో వుంటుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం వుంటుంది. అయితే.. ఈ సారి అటవీ శాఖ అనూహ్యంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకుంది.
ఈ సారి ఈ లొద్ది మల్లయ్య జాతరను నిలిపేస్తున్నామని, వన్యప్రాణులు సంతానోత్పత్తి జరిగే సమయం ఇది అని, అందుకే ఆ ప్రాంతంలోకి మనుషుల సంచారాన్ని నిషేధిస్తున్నామని ప్రకటించింది. ఈ నిషేధాన్ని గమనించకుండా ఎవరైనా వెళితే జరిమానాలు విధిస్తామని, వారి వాహనాలను కూడా సీజ్ చేస్తామంటూ హెచ్చరికలకు దిగారు. దీనిపై హిందువులు, భక్తులు, విశ్వహిందూ పరిషత్ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిషేధాన్ని విధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ మనోవిశ్వాసాలపై తీవ్రంగా దాడి చేస్తోందని, హిందువుల ప్రాథమిక హక్కులను కూడా హరించి వేస్తోందని తెలంగాణ విశ్వహిందూ పరిషత్ సహ కార్యదర్శి రావినూతల శశిధర్ మండిపడ్డారు. యేడాది పొడవునా పర్యాటకుల పేరిట చాలా మందిని ఆ ప్రాంతంలోకి అనుమతినిస్తున్నారని, కానీ.. ఈ మూడు రోజుల శ్రద్ధాసక్తులతో నిర్వహించుకునే లొద్ది మల్లయ్య జాతరకు మాత్రం ఇబ్బందా? అంటూ ప్రశ్నించారు. పులుల సంఖ్య పెరుగుతోందని, వాటి పునరుత్పత్తికి మానవుల సంచారం ఆ ప్రాంతంలో ఇబ్బందులు పెడుతోందని అటవీ శాఖ చెబుతోందని, కానీ.. ఈ సమయంలో భక్తులు సంచారం చేస్తే.. పులు పునరుత్పత్తిపై ఎన్నడూ ప్రభావం చూపలేదని, దానికి తగ్గ ఆధారాలు కూడా లేవని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది.