దేవాలయాల నిర్వహణ హిందువులకు ఇచ్చేయాలి : మిలింద్ పరాండే

దేవాలయాల నిర్వహణ హైందవ సమాజానికి అప్పగించాలని.. విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరండే పేర్కొన్నారు. పవిత్రమైన తిరుపతి లడ్డూ విషయంలో వెలుగులోకి వచ్చిన సమాచారంతో దేశ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. తిరుపతి, శ్రీశైలం వంటి ఆలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉన్నారని, మతమార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చాలాచోట్ల దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. భక్తులు దేవుడి కోసం ఇచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఆ దేవుడి కోసం, ధర్మప్రచారానికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
మిలింద్‌ పరండే విజయవాడలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘చర్చిలు, మసీదుల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోని ప్రభుత్వాలు.. ఆలయాలపై మాత్రం ఎందుకు పెత్తనం చేస్తున్నాయని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల నిర్వహణను హిందూ సమాజానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.  అవసరమైతే దీనికోసం జాతీయ స్థాయిలో చట్టం తేవాలన్నారు. ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా, అందరిలో చైతన్యం కలిగించేందుకు జనవరి 5న విజయవాడలో భారీ ఎత్తున హైందవ శంఖారావం నిర్వహించనున్నామని ప్రకటించారు.
జనవరి 13 నుంచి ప్రయాగ్‌లో జరిగే కుంభమేళాలోనూ ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఇటీవల 57 పురాతన ఆలయాలను తన నియంత్రణలోకి తీసుకుందని తెలిపారు.  వీహెచ్‌పీ చర్చలు జరపడంతో మళ్లీ వాటి నిర్వహణను హిందూ సంఘాలకే అప్పగించిందని వెల్లడించారు.  ప్రభుత్వ జోక్యం లేకుండా భక్తిభావం కలిగిన వారితో ఆలయ ట్రస్టీలను ఎంపిక చేసేలా స్వతంత్రత ఉండాలని  పేర్కొన్నారు. వీహెచ్‌పీ కేంద్ర ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. గన్నవరం వద్ద 50 ఎకరాల్లో హైందవ శంఖారావం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *