మరోసారి దాడులు చేయడానికి పాక్ జంకిపోవాలి.. అలా చేయండి : అలోక్ కుమార్
పాక్ ఉగ్రవాద దుశ్చర్యలను ఆపడానికి, జిహాదీల చర్యలను నిర్మూలించడానికి హిందువులు ఐక్యం కావాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ పనులకు అడ్డుకట్ట వేయడానికి హిందూ ఐక్యత అత్యావశ్యకమని అన్నారు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ASR సాంస్కృతిక కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో అలోక్ కుమార్ మాట్లాడారు. ఘర్ వాపసీ, ప్రభుత్వ హస్తాల నుంచి హిందూ దేవాలయాలను విముక్తం చేయడం, మత మార్పిడులను అడ్డుకోవడం, పేదలకు సేవా ప్రాజెక్టులను పెంచడం వంటి కార్యక్రమాలపై మరింత దృష్టి నిలుపుతామని అన్నారు.
పహల్గాం ఉగ్రదాడి పక్కా జిహాదీ ఉగ్రవాది చర్యే అని అలోక్ అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు పర్యాటకుల మతాన్ని అడిగి మరీ, వారిలో హిందువులను మాత్రమే చంపారని మండిపడ్డారు. ఇలాంటి దారుణమైన చర్యలకు, శిక్షణనివ్వడం, మద్దతిచ్చే ప్రేరణ కేవలం పాక్ నుంచే వస్తోందని మండిపడ్డారు.ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించాలని నిర్ణయించుకుందని, అందుకు చాలా సంతోషంగా వుందని అలోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచవద్దని, లేదా.. దాడికి తగ్గట్లుగానే స్పందించాలని కొన్ని దేశాలు భారత్ కి సలహాలివ్వడం చూస్తుంటే తమకు ఎంతో ఆశ్చర్యం కలుగుతోందని అలోక్ కుమార్ పరోక్షంగా అమెరికాపై విరుచుకుపడ్డారు. జిహాదీలు హిందువులను చంపడం ద్వారా దేశ గౌరవంపై దాడి చేసినట్లేనని అభివర్ణించారు. అలాగే ప్రజల ఆర్థిక వ్యవస్ధ, సంక్షేమంపై కూడా దాడి చేసినట్లేనని అన్నారు. పరిమితంగానే స్పందిస్తే కుదరని పని అని తగిన బుద్ధి చెప్పాల్సిందేనని అలోక్ కుమార్ తేల్చి చెప్పారు. మరోసారి భారత్ లక్ష్యంగా పాక్ దాడులు చేయడానికి జంకిపోవాలని, ఇలాంటివి ఎప్పుడూ పునరావృత్తం కాకుండా వుండేలా భారత్ స్పందన వుండాలని సూచించారు. ఇందులో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని భారత ప్రభుత్వానికి సూచించారు.
జిహాదీ సవాలు కూడా ఓ సైద్ధాంతి ప్రశ్నే అని, హింస, అపహరణ, హత్యలను మతపరమైన కోణాన్ని అద్దే ముస్లింలలోని ఓ వర్గాన్ని కచ్చితంగా ప్రతిఘటించాల్సిందేనని అలోక్ కుమార్ తేల్చి చెప్పారు. దేశ భద్రత, ప్రజల పురోగతి కోసం హిందువులను ఏకం చేసే ప్రయత్నాలను VHP కొనసాగిస్తూనే వుంటుందన్నారు.