తిరుమల ఘటనను నిరసిస్తూ తెలంగాణలో వీహెచ్ పీ ఆందోళనలు
తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రత ఘటన హిందువుల మనోభావాలను గాయపరచిందని విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లడ్డు తయారీలో గొడ్డు కొవ్వు.. పంది కొవ్వు.. చేపల మాంసము వంటి వ్యర్థాలను ఉపయోగించడం తిరుమల తిరుపతికి తీవ్రమైన పాపం తలపెట్టారని మండిపడింది. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సంస్థ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతిలో చేసిన మహా పాపాన్ని సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సోమవారం ఉదయం అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించి, కలెక్టర్ కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. అదేవిధంగా ప్రధాన కూడళ్ళు, చౌరస్తాలలో ప్లకార్డులతో శాంతియుత నిరసన తెలియజేస్తామని వారు చెప్పారు. వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందూ బంధువులు భారీగా హాజరై నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.