రాజకీయ నేతల వల్లే సంభాల్ హింస : వీహెచ్ పీ
యూపీలోని సంభాల్ లో ముస్లిం ఛాందసులు వ్యవహరించిన తీరును, వారి హింసా కాండను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా దుయ్యబట్టింది. వారి చర్యలను ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ జాతీయ సహ సంఘటన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు పోలీసులపైకి రాళ్లు రువ్వడం, కాల్చడం, వాహనాలకు నిప్పంటిడం అత్యంత ఖండనీయమని అన్నారు. అంతేకాకుండా ఈ హింసాత్మక చర్యలకు సమాజ్ వాదీ, కాంగ్రెస్ నేతలు మద్దతు పలికిన తీరు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ హింసా కాండ తీరును చూస్తుంటే ఈ రాజకీయ నేతలు రెచ్చగొట్టడం వల్ల, మౌలానాల సూచనల మేరకే జరిగిందని స్పష్టమైపోతోందన్నారు.ఇలాంటి ఆందోళనకారులు ఇళ్లకు కూడా నిప్పు పెట్టడానికి వెనకాడరన్నారు.
హింసకు, అల్లర్లకి పాల్పడిన వారిని, వారికి మద్దతిచ్చిన వారిన వెంటనే అరెస్ట్ చేయాలని సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. గుడ్డిగా ఈ హింసను ప్రేరేపించిన నాయకులంతా చివరికి బాధితులుగా మారడం చరిత్రలో వుందన్నారు. హరిహర ఆలయాన్ని కూల్చేసిన తర్వాత నిర్మించిన జామా మసీదు రీ సర్వేకు న్యాయవ్యవస్థ ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు. అయితే పరిపాలన శాఖ కేవలం ఆ ఉత్తర్వులను పాటిస్తుందన్నారు.
వీటిపై ఎవరికైనా అభ్యంతరం వుంటే హైకోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా వున్నాయన్నారు. అంతేకానీ రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టి, కోర్టు ఆదేశాల అమలును ఆపడానికి ప్రయత్నం చేయడంలో వున్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.తమ వాదనలను వినిపించే హక్కు న్యాయస్థానం ఇస్తుందని, యాకూబ్ మెమన్ వంటి కరుడు గట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదులకే ఆ అవకాశం దక్కిందన్నారు. వీరి హింసామార్గమే ముస్లిం ఛాందసుల పతనానికి నాంది అని హెచ్చరించారు.