‘పంచ పరివర్తన్’ ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలి : చామర్తి ఉమామహేశ్వర రావు

నేటి సమాజంలో పంచ పరివర్తనతో చక్కటి పురోగతి తీసుకొని రావచ్చు అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు.‌ పర్యావరణం, కుటుంబ ప్రభావం, సామాజిక సమరసత, స్వధర్మ, నాగరికత విలువలు అనే ఐదు అంశాల్ని పాఠశాల వేదికగా సమాజంలోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలలో విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
పాఠశాలలు క్షేత్ర స్థాయిలో భౌగోళికంగా, సామాజికంగా కూడా విస్తరించాలని విద్యా భారతి అఖిల భారత కార్యకారిణీ సదస్యులు జే.ఎం. కాశీపతి సూచించారు. వివిధ రాష్ట్రాలలోని జిల్లాలు, మండలాలు, మరింత కింది స్థాయికి కూడా శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలు విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కార కేంద్రాలు, అలాగే తీర ప్రాంతాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాల వల్ల సమాజంలో మంచి పరివర్తన కనిపిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ బండ్లగూడలోని శారదా ధామంలో రెండు రోజుల పాటు విద్యా భారతి దక్షిణమధ్య క్షేత్ర సాధారణ సభ నిర్వహించారు. ఈ సమావేశాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలోని విద్యాభారతి పాలక మండలి, బాధ్యులు, విషయ ప్రముఖులు హాజరయ్యారు.
విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో సశక్తికరణ, విస్తరణ, వికాసం, కార్యాచరణ యోజన మీద అందరూ దృష్టిని కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాల కేంద్రంగానే మంచి పోకడలకు శ్రీకారం చుట్టాలన్నారు. విద్యాపీఠం పని కేవలం పాఠశాలల నిర్వాహణ మాత్రమే కాదని, సమాజ అవసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. వాటిని తీర్చడానికే వున్నాయన్నారు.విద్యా భారతి క్షేత్ర కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు, క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ వివిధ భాగాల పురోగతిని సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *