క్రీడలతో ఆత్మ విశ్వాసం, మనోధైర్యం సిద్ధిస్తుంది : ఖేల్ ఖూద్ సమారోప్ లో వక్తలు
క్రీడలతో సర్వాంగీణ వికాసం సిద్ధిస్తుందని, వ్యక్తిత్వ వికాసం చెందుతుందని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు అన్నారు. అలాగే జట్టు స్ఫూర్తి కూడా అలవడుతుందని, సామూహిక శక్తిలా మారి, విజయం వైపు వెళ్తారన్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత రాష్ట్రస్థాయి ఖేల్ ఖూద్ సమారోప్ ఉత్సవం భైంసాలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పతకమూరి శ్రీనివాస రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. క్రీడలతో ఆత్మ విశ్వాసం, మనోధైర్యం వస్తాయని, జీవితంలో వచ్చే ఛాలెంజ్ ను ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుందన్నారు. అలాగే వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందని, అందరితో కలిసే పనిచేసే స్వభావం క్రీడలతో వస్తుందన్నారు. అలాగే క్రీడలు ఆడటం ద్వారా వీరోచిత పోరాటం చేసే గుణం కూడా అలవడుతుందన్నారు. జీవితమంటే కేవలం చదువులు, మార్కులు మాత్రమే కాదన్నారు. మిగతా విషయాలు కూడా జీవితంలో భాగమేనని, వాటిలో మనకు నచ్చిన వాటిని స్వీకరించి, అందులో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. శ్రీ సరస్వతీ శిశు మందిరాల విద్యార్థులు జాతీయ స్థాయి, ఒలంపిక్స్ లో కూడా భాగస్వామై, గెలుపొందారని, భారత దేశ గౌరవాన్ని నిలబెట్టారని గుర్తు చేశారు.

కబడ్డీ భారతీయ క్రీడ అని, ప్రతి ఇంట్లో కూడా దీనిని ఆడతారని అన్నారు. విజిగీషు ప్రవృత్తి, వీరోచిత పోరాట చేసే శక్తి కబడ్డీ ద్వారా వస్తుందన్నారు. అలాగే పునర్జన్మ సిద్ధాంత, పునరపి జననం అన్న సిద్ధాంతాలు కూడా ఒంటబడుతాయని వివరించారు.అలాగే చావంటే భయం లేకుండా కూడా కబడ్డీ క్రీడ చేస్తుందన్నారు.బలమైన శరీరంతోనే దృఢమైన మనస్సు వస్తుందని స్వామి వివేకానంద తరుచూ అనేవారని గుర్తు చేశారు. మనలో వున్న అనంత శక్తిని గుర్తించాలని, దానిని వెలికితీస్తే కేవలం క్రీడల్లోనే కాకుండా అన్నింటా విజయం సాధించవచ్చని తెలిపారు. క్రీడలతో అనేక సుగుణాల వికాసం చెందుతాయని, నిరంతర సాధన, క్రమశిక్షణ ద్వారా క్రీడా రంగంలో పాటు, జీవితంలో కూడా అన్ని సాధించవచ్చని పతకమూరి అన్నారు.

గెలుపొందిన వారికి పతకాలు..
ఖేల్ ఖూద్ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు అతిథులు పతకాలు అందజేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మదిపెల్లి రవి, విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేత యార్లగడ్డ శ్రీనివాస రావు, నిర్మల్ జిల్లా విద్యాపీఠం అధ్యక్షులు నార్లాపురం రవీందర్, ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు పతకాలను అందజేశారు.