భైంసాలో ఘనంగా ప్రారంభమైన విద్యాపీఠం ప్రాంత స్థాయి ‘‘ఖేల్ ఖూద్’’

శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రాంత స్థాయి ఖేల్ ఖూద్ భైంసాలో ప్రారంభమైంది. భైంసా కిసాన్ గల్లీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో 5,6,7 తేదీల్లో జరుగుతోంది. దీనికి తెలంగాణ వ్యాప్తంగా వున్న పాఠశాలల నుంచి వెయ్యికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన ఉద్ఘాటన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై, ఖేల్ ఖూద్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సరస్వతీ శిశు మందిరాలు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా అందిస్తాయని భైంసా శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ అన్నారు. చదువు, సంస్కారాలతో పాటు దేశభక్తిని కూడా అందించి, దేశభక్తులను తయారు చేస్తున్న సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ఖేల్ ఖూద్ పోటీలకు భైంసా పట్టణం వేదికైనందుకు ఆనందంగా వుందన్నారు. పోటీలలో ఓటమి చెందితే నిరాశపడాల్సిన అవసరం లేదని, మళ్లీ ప్రయత్నాలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు, మణిపూర్ యూనివర్సిటీ ఛాన్సలర్ తక్కళ్లపల్లి తిరుపతి రావు మాట్లాడుతూ శ్రీ సరస్వతీ శిశుమందిరాల్లో సర్వాంగీణ వికాసం వుంటుందని, విద్యాపీఠం స్థాపన నుండే క్రీడలపై ప్రత్యేక దృష్టి నిలిపామన్నారు.

క్రీడల ద్వారా మనో వికాసం, ఆరోగ్యం మెరుగవుతాయని, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతాయని వివరించారు. ఆటలు ఆడటం ద్వారా, శ్రద్ధగా, నీతిగా ఆడితే కర్మయోగులు అవుతారని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుందని వివరించారు.క్రీడల్లో ఓడితే మనోధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని, మళ్ళీ ప్రయత్నాలు చేయాలని తిరుపతి రావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రాంత సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాసరావు, ఆదిలాబాద్ విభాగ్ అధ్యక్షులు బజరంగ్ అగర్వాల్, నిర్మల్ అధ్యక్షులు రవీందర్, డిప్యూటీ ఇంజినీర్ వాగ్మారే సునీల్, మండల విద్యాధికారి సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *