‘‘సప్తశక్తి సంగం’’ తో మహిళలు మరింత జాగృతమయ్యారు : జస్టిస్ మాధవీ దేవి
మహిళలో అంతర్లీనంగా వున్న సప్తశక్తులను జాగృతం చేయడానికి సప్తశక్తి సంగం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీ దేవి అన్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మహిళలను జాగృతం చేయడానికి సప్తశక్తి సంగమాలు జరగడం ముదావహం అని అన్నారు. మహిళలలో అలాంటి శక్తులను జాగృతం చేయడం శ్రీ సరస్వతీ శిశు మందిరాల ద్వారానే సాధ్యమని అన్నారు. నారాయణ గూడ కేశవ మెమోరియల్ పటేల్ హాలులో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం సప్తశక్తి సంగం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ మాధవీ దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ శక్తిగా మారడానికి వారంతటవారే ప్రయత్నం సాగించాలని, బాహ్య సౌందర్యంతో పాటు అంతస్సౌందర్యం కూడా ముఖ్యమేనన్నారు. మనల్ని మనం ఉత్తములుగా మలుచుకోవడానికి భారతీయ సంస్కృతి, భారతీయ కుటుంబం ఉపకరిస్తుందని, కుటుంబంలో పెద్దల ద్వారా అది మరింత వికసిస్తుందని తెలిపారు. కుటుంబం మొత్తం ఆరోగ్యంగా, క్షేమంగా వుండాలంటే అది మహిళల చేతిలోనే వుందని, ఇంట్లోని వంటశాలే ఆరోగ్య శాల అని గుర్తుచేశారు.
నేటి ఆధునిక కాలంలో పురుషులు, స్త్రీలూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని, అయితే.. ఉద్యోగం మాత్రమే సర్వస్వం కాదని, సమాజం, కుటుంబం కూడా ముఖ్యమేనని ఉద్బోధించారు. దేశ జనాభాలో సగం మంది మహిళలే అని, వారంతా సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించాలని, ఏం పని చేసినా దేశం కోసం పనిచేసేలా వుండాలని పిలుపునిచ్చారు. అలాగే కుటుంబంలోని సభ్యులందరూ దేశం కోసం, సమాజం కోసం పని చేసేలా వాతావరణం రావడంలో మహిళలదే కీలక పాత్ర అని నొక్కి చెప్పారు.
పురుషులు, స్త్రీలు ఇద్దరూ చైతన్యవంతులుగా తయారవ్వాలని, ఒకేలా ఆలోచించాలని, అప్పుడే సమాజం సజావుగా సాగుతుందని అన్నారు. సమాజంలో మహిళలకు పుష్కలమైన అవకాశాలు వున్నాయని, స్వతంత్రంగా ఆలోచించి, సరైన నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళలు ఏ రంగంలో ఎదిగినా, ఆ రంగం అద్భుతంగా వికసిస్తుందని, ఆ రంగంపై తమదైన ముద్ర వేస్తారని, అంతటి శక్తిమంతులు మహిళలని కొనియాడారు. అత్యద్భుతమైన భారతావణి కోసం మహిళలు తమవంతు బాధ్యత పోషించాలన్నారు.
తాను కూడా సరస్వతీ శిశు మందిర్ పూర్వ విద్యార్థినేనని అన్నారు. విద్యాపీఠం నిర్వహిస్తున్న సప్తశక్తి సంగం ద్వారా ఎంతో మంది మహిళల్లో చైతన్యం వచ్చిందని,మంచి భారతీయ మహిళలుగా రూపొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.

ఇక ముఖ్య వక్తగా రాష్ట్రీయ సేవికా సమితి ప్రాంత కార్యవాహిక శ్రీపాద రాధ మాట్లాడుతూ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని మహిళా శక్తికి అనుసంధానిస్తూ మాట్లాడారు. విద్యాపీఠం రాష్ట్ర వ్యాప్తంగా సప్తశక్తి సంగమాలు నిర్వహించి, చరిత్ర సృష్టించారని కొనియాడారు. వ్యక్తి నిర్మాణం, సుఖం కలగాలంటే భారతీయ చింతన ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. వ్యక్తికి నిజమైన సుఖం ధర్మం ఆధారంగానే సిద్ధిస్తుందని దీనదయాళ్ ఉపాధ్యాయ సూచించారని అన్నారు. తల్లి పిల్లలకు మొదట కుటుంబాన్ని, ఆ తర్వాత సమాజాన్ని, ఆ తర్వాత ప్రకృతిని, చివరన దైవాన్ని పరిచయం చేస్తుందని, ఏకాత్మ మానవ దర్శనం కూడా అదేనన్నారు.

అందరిలోనూ ఈశ్వరుడ్ని దర్శించేది భారత ధర్మమని, ఏకరూపత లేకున్నా.. సమాజంలో ఏకత్వం వుందన్నారు. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ కలిస్తేనే వ్యక్తి అని దీనదయాళ్ ప్రతిపాదించారని అన్నారు. వ్యక్తికి ప్రాణశక్తి వున్నట్లే దేశానికి కూడా ప్రాణశక్తి వుంటుందని అదే సంస్కృతి అని, భారత్ ప్రాణశక్తి వసుధైవ కుటుంబం అని అన్నారు.ఏకాత్మ అన్న ప్రాణశక్తిని అందరూ ఉపాసన చేయాలని, పరమేష్ఠితో కలిస్తేనే జీవునికి పరిపూర్ణత్వమని దీనదయాళ్ ప్రతిపాదించారని అన్నారు.
ఇక విద్యాపీఠం ప్రాంత కార్యదర్శి అనఘా వేంకట లక్ష్మీ విద్యాపీఠం సప్తశక్తి దంగం నివేదికను సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,345 సప్తశక్తి సంగమాలు జరిగాయని, 30 వేల మందికి పైగా ఈ కార్యక్రమానికి మహిళలు వచ్చారన్నారు. కుటుంబానికి మహిళే ఆధారమని తెలిపారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర బాలికా ప్రముఖ్ ధరణీ ప్రియ కూడా పాల్గొన్నారు.