అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించిన వారు శ్రీ విద్యారణ్యులు
ఏకశిలానగరం (నేటి వరంగల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం. మాధవుని తమ్ముళ్ళు సాయణుడు, భోగనాధుడు. భోగనాధుడు మంచి కవిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే మరణించాడు. మాధవ, సాయణులు శృంగేరీపీఠంలో ఆశ్రయంపొందారు. శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు. భారతి కృష్ణ తీర్థ, శంకరానందుల దగ్గర మాధవులు శాస్త్రాభ్యాసం చేశారు. ఆ విధంగా అన్నాతమ్ముళ్ళిద్దరు సన్యాసం స్వీకరించారు (క్రీ.శ.1331).
ఒకసారి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ శిష్యులను వారి వారి జీవిత లక్ష్యాలను చెప్పమన్నారు. అందరూ రకరకాలుగా చెప్పారు. విద్యారణ్యులు దేశ, ధర్మాలను రక్షించడమే తన లక్ష్యమని, దానికోసమే తన జీవితాన్ని సమర్పిస్తానని చెప్పారు. దీనికి భారతీ తీర్థ సంతోషించి ఈ లక్ష్య సాధనకు తపోశక్తి అవసరమని అందుకు సాధన చేయాలని సూచించారు. విద్యారణ్యులు కాశీయాత్ర ముగించుకుని, హంపి చేరి తీవ్ర తపస్సు చేసారు.
మొగలాయి దండయాత్రలు, ఆగడాలతో దక్షిణ భారతదేశం అతలాకుతలమయింది. శ్రీరంగం, మధుర మొదలయిన ప్రధాన దేవాలయాలతో సహా అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అనేకమంది హిందువులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు. ఈ పరిస్థితులు చూసి విద్యారణ్యులు చాలా బాధపడ్డారు.
క్రీ.శ.1323లో కాకతీయసామ్రాజ్యం పతనమైంది. కాకతీయచక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడితోపాటు అనేకమంది రాజ్యాధికారులను కూడా ఢిల్లీసుల్తాను బందీలను చేసి ఢిల్లీకి తరలించాడు. కాకతీయసామ్రాజ్యంలో ఆశ్రయం పొందిన పండితులు, సేనాధిపతులు దక్షిణదేశంలోని వేరువేరు ప్రదేశాలకు వలసపోయారు. అలా వలస వచ్చినవారిలో విద్యారణ్యుల తండ్రి మాయణాచార్యుడు కూడా ఉన్నారు. ఢిల్లీసుల్తాను దాడికి ప్రతిక్రియగా దక్షిణదేశంలో తిరుగుబాట్లు చెలరేగాయి.వాటిని అణచడం కోసం ఢిల్లీ సుల్తాను తాను బందీలుగా తీసుకుపోయి, ముస్లిములుగా మార్చిన హరిహర, బుక్కలను ఆనెగొంది ప్రాంతంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు పంపాడు. ఆనెగొంది, తదితర ప్రాంతాల్లో పరిస్థితులు ముస్లింపాలనకు ఏమాత్రం అనుకూలంగాలేవు. ఢిల్లీసుల్తాను ప్రతినిధులుగా వచ్చిన హరిహరబుక్కలను ఆనెగొందె ప్రజలు తరిమేశారు. అలా ప్రజల వ్యతిరేకతను చవిచూసిన హరిహరబుక్కలు పంపారణ్య ప్రాంతంలో తిరుగుతూ విద్యారణ్యుల దగ్గరకు చేరారు. అప్పుడు విద్యారణ్యస్వామి వారిని తిరిగి హిందువులుగా మార్చి, వారి సహాయంతో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు వేసారు. సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి తొలిరోజుల్లో విద్యారణ్యులు ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించారు.ఇలా హిందూసామ్రాజ్యం స్థిరపడిన తరువాత ఆయన శృంగేరీ పీఠానికి తిరిగివచ్చారు.అలా రాజకీయంగా హిందువులను స్థిరపరచడంతోపాటు ధార్మికరంగంలో హిందువులకు మార్గదర్శనం చేశారు.
పరాశరమాధవీయం మొదలైన గ్రంథాల రచన ద్వారా ధర్మశాస్త్రాలను తమ కాలానికి తగిన విధంగా నవీకరించారు. అలాగే దర్శనజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వదర్శనసంగ్రహం అనే గ్రంథం వ్రాశారు. తాను మొదలుపెట్టిన వేదభాష్య రచనను తన శిష్యులకు పూర్తిచేయమని అప్పగించారు. వాళ్ళు ఆ పనిని సమర్థవంతంగా పూర్తిచేసారు. విద్యారణుల అథ్వర్యంలో విజయనగరం మధ్యలో విరూపాక్ష దేవాలయం కలిగివుండి, శ్రీకారం రూపంలో నిర్మించబడింది.
ఇలా 14వ శతాబ్దంలో ముస్లిందాడులు, ఇతర చారిత్రకకారణాలవల్ల బలహీనపడిన హిందూసమాజ, సంస్కృతులను సంస్కరించి, పునరుజ్జీవింపచేయడంలో మాధవవిద్యారణ్యులు ప్రముఖపాత్ర నిర్వహించారు.ఆ విధంగా హిందూధర్మ పరిరక్షణకు పాటుపడిన విద్యారణ్యులవారిని ‘అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించిన విద్యారణ్యు లకు నమస్కారం’ అని ప్రతి రోజు ప్రతి హిందువు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
(విద్యారణ్యుల జయంతి సందర్భంగా)