సంపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం : విజయ్ రామ్
భవిష్యత్తు తరాలు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గమని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ కృషి విధాన ప్రచారకులు విజయ్‌రామ్ అన్నారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సును తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువులో నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాదు సమీపంలోని శాంతివనంలో 10 వేల మంది యువ రైతులతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని.. అందుకుగాను యువ రైతులను సన్నద్ధం చేసే క్రమంలో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా తొలుత దివాన్‌చెరువులో ఈ సదస్సు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా విజయరామ్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, వ్యవసాయ విధి విధానాలు, గోమాత విశిష్టత గురించి వివరించారు. భూ సమతుల్యత, వైవిధ్యం కాపాడుకోవడం ప్రజలందరి సమష్టి బాధ్యత అన్నారు. సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానంలో బయటి నుంచి ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు కొనే అవసరం ఉండదన్నారు. గ్రామీణ వికాసం కోసం ప్రస్తుతం మూసపద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని, దీని వల్ల భూతాపం పెరిగిపోతోందన్నారు. భూతాపం తగ్గించేందుకు ఐదంచెల సాగు విధానాన్ని చేపట్టాలని.. అందులో దుంపలు, అంతర పంటలు ఉంటాయన్నారు.
వెదురును సాగుచేయడం ద్వారా చెంచాలు తదితర వస్తువులను తయారు చేయవచ్చని.. వాటి వ్యర్థాలు నేలలో త్వరితగతిన కలిసిపోతాయన్నారు. వరికోత యంత్రాల వల్ల భూమి సున్నితత్వం తగ్గిపోతుందని వివరించారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2800 కోట్లు మంజూరు చేసిందని, దానికి కేబినేట్ ఆమోదం కూడా లభించిందన్నారు. దేశవ్యాప్తంగా కోటి ఎకరాలలో ఆర్గానిక్ వ్యవసాయం చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సదస్సు నిర్వాహకుడు అంబటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.