దేవాలయాల పరిరక్షణకు ఏకం కావాలి : వక్తలు
దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని విద్యాభారతి ప్రాంత కార్యదర్శి జిగురు ప్రతాపసింహ శాస్త్రి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు హిందూ దేవాలయ పరిరక్షణ కోసం 2025 జనవరి 5న విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి సంబంధించి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. హిందూ ఆలయాల వ్యవస్థను రక్షించుకునేందుకు హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి గ్రామం నుంచి హిందువులు పెద్ద సంఖ్యలో విజయవాడ హైందవ శంఖారావానికి తరలిరావాలని కోరారు. ఇందుకు సంబంధించి ముందుగా గ్రామాల స్థాయిలో ఏర్పాటు చేయవలసిన సమావేశాలు, సన్నాహక నిర్ణయాలు వివరించారు.
పల్నాడు జిల్లా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ బాధ్యులు తిప్పిరెడ్డి జయనేందర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ బాధ్యులు డాక్టర్ పమిడిమళ్ళ మహేశ్వర్‌రెడ్డి, నరసింహగిరిస్వామి, బదరినారాయణలు మాట్లాడారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించిన కరపత్రాలను నరసింహగిరిస్వామి ఆవిష్కరించారు. సన్నాహక సమావేశంలో బాధ్యులు చలువాది చినసత్యనారాయణ, అబ్బూరి సత్యనారాయణ, తొమ్మండ్రు సత్యనారాయణ, దేవరశెట్టి రవికుమార్, శంకర్, బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, బీజేపీ నాయకులు, పలు దేవాలయాల నిర్వాహకులు, వినాయక మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు.