గ్రామసభల నిర్వహణ తీరు – 2
గ్రామసభ శక్తి: భాగం-3
ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1994లోని సెక్షన్ 6 గ్రామసభ గురించి, అందులో కోరం, అంటే పాల్గొనాల్సిన కనీస సభ్యుల సంఖ్య గురించి వివరిస్తుంది. గ్రామసర్పంచ్ అధ్యక్షతన ఏడాదిలో కనీసం 4 సార్లు గ్రామసభ జరగాలి. అలా గ్రామసభ నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవి కోల్పోతాడు. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ సర్పంచ్ హాజరు కాకపొతే ఉపసర్పంచ్ లేదా పంచాయితీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభ సమావేశం జరగాలి. గ్రామ సభకు ఏర్పాట్లు చేసి, సభ సజావుగా నిర్వహించే బాధ్యత పంచాయితీ సెక్రెటరీకి ఉంటుంది.
గ్రామసభ నిర్వహణకు ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు ఉన్నాయి.
– సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపు గ్రామసభ జరగాలి.
– గ్రామసభ సమావేశం ఎప్పుడు, ఎక్కడ, ఎన్నింటికి మొదలవుతుంది, సమావేశం ఎజెండా ఏమిటి అనే విషయాలు ముందుగానే స్పష్టంగా తెలియజేస్తూ గ్రామ పంచాయితీ అధికారి ఊర్లో చాటింపు వేయించాలి.
ఊర్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో నోటీసు అంటించడం, దేవాలయాల్లోని మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించడం, ఇంకా, పాఠశాలల్లోని చిన్నపిల్లల ద్వారా వారి తల్లిదండ్రులకు విషయం చేరవేయడం.. ఇలా అనేక పద్ధతుల్లో గ్రామసభ సమావేశం గురించి ప్రజలకు తెలియజేయవచ్చు. ఇవే కాకుండా ఇంకా మరేమైనా మార్గాలుంటే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు.
అధికారులు గ్రామసభకు హాజరైన సభ్యులు, అంటే ప్రజల సంతకాలు, వేలిముద్రలు తీసుకోవాలి. ఏ అంశంపైన అయినా చర్చ జరిగితే, ఎంతమంది చర్చలో పాల్గొన్నారు, ఎంతమంది తీర్మానాలు ఆమోదించారు, ఎంతమంది తిరస్కరిం చారు అనేవి స్పష్టంగా పేర్కొనాలి. వాటిని గ్రామ సభకు సంబంధించిన తీర్మానాల రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. ఈ వ్యవహారమంతా పంచాయితీ సెక్రెటరీ చూసుకోవాలి. కానీ చాలా ప్రాంతాల్లో ఇది సక్రమంగా అమలు కావట్లేదు అని తెలుస్తోంది. ఇక్కడ ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి, వివరాలు సక్రమంగా ఎంటర్ చేస్తున్నారా లేదా సరిచూసు కోవాలి. అనేక గ్రామాల్లో గ్రామసభలు నిర్వహణ సక్రమంగా జరగట్లేదు అని నిజం టుడే అనే ఛానెల్ ఇటీవల చేసిన సర్వేలో తెలిసింది. మనం గుర్తు పెట్టుకోవాల్సిదే మంటే.. ప్రశ్నించాల్సిన గ్రామస్థులు ప్రశ్నిం చేదాకా ఏదీ జరగదు. గ్రామసభలు నిర్వహించకపోయినా, సమావేశాల గురించి గ్రామ స్థులకు సమాచారం ఇవ్వక పోయినా, హాజరైనవారి పేర్లు సక్రమంగా నమోదు చేయకపోయినా గ్రామ సభ సభ్యులు, అంటే ప్రజలు పంచా యితీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
గ్రామసభకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అధికారులు తరచూ నిర్వహించే గ్రామసభ కాకుండా ఏదైనా అత్యవసర మైన సందర్భాల్లో, ఏదైనా ముఖ్యమైన అంశంపై గ్రామసభ నిర్వహించాలి అని ప్రజలు కోరవచ్చు. అందుకు గ్రామసభలోని 10 శాతం సభ్యులు, అంటే ఓటుహక్కు ఉన్నవారిలో 10 శాతం మంది రాతపూర్వకంగా పంచాయితీ సెక్రెటరీ, సర్పంచ్ లకు కనీసం వారం రోజులు ముందు నోటీస్ ఇవ్వవచ్చు. గ్రామసభ అజెండా అందులో స్పష్టంగా పేర్కొనాలి. అలా నోటీస్ ఇచ్చాక కూడా గ్రామసభ ఏర్పాటు చేయకపోతే, ప్రజలే స్వచ్చందంగా సమావేశమై, ఎంతమంది వచ్చారు, ఎంతమంది తీర్మానాలు ఆమోదించారు మొదలైన అంశాలు తెల్లకాగితంపై రాసి, వాటిని రిజిస్టర్లో ఎంటర్ చేయాల్సిందిగా పంచాయితీ సెక్రెటరీకి, అలాగే వాటి కాపీలను జిల్లా కలెక్టర్, పంచాయితీ కమిష నర్లకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఒక్కసారి ప్రజల్లో చట్టాలపై, గ్రామసభలపై అవగాహన వస్తే అవినీతిని అంతం చేయవచ్చు.
– ఏ.ఎస్. సంతోష్