పంచభూతాల మధ్య సమతుల్యత కాపాడాల్సింది మనమే… విస్మరించరాదు : విశ్వ యోగి విశ్వంజీ
మనం భూమాతను అంటే పృథ్వీ మాతను ఆరాధించాలి. సంరక్షించుకోవాలి. పృథ్వీ మాతను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. పృథ్వీ మాతను సంరక్షించుకుంటే ఈ భూమిపై వున్న 84 లక్షల జీవరాసులు బాగుంటాయి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో పృథ్వీమాతకు ఆపద ఏర్పడుతోంది. ‘‘పృథీశాంతి:, ఆపశ్శాంతి: అంటూ మన వేదాలు చెబుతున్నాయి. పంచభూతాలు శాంతింగా వుండాలంటే ఈ భూమండలం చక్కగా వుండాలి. అందుకే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై వుంది. పంచభూతాలు కలుషితం అయితే ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది. పంచభూతాల మధ్య సమతుల్యత కాపాడ్సింది మనమే. దీనిని విస్మరించరాదు. పంచభూతాలను కలుషితం చేయకూడదు, కలుషితం కాకుండా అందరూ పనిచేయాలి. ఇవి కలుషితం అయితే వీటి మధ్య సమతౌల్యత పోయి, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. ఈ కారణంగానే ఇవి కలుషితం కాకుండా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలి.
పృథ్వీ మాతను రక్షించుకునేందుకు అందరూ మేల్కొనాలి. ఐక్యంగా పనిచేయాలి. దేశాధినేతలు ఈ కోణంలో ఆలోచించి, సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, జపాన్ తదితర అన్ని దేశాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. భూకంపాలు, తీవ్రమైన గాలులు, అగ్నివర్షాలు, సునామీలు, కుంభవృష్టి, వరదలు అన్నీ దేశాల్లో చూస్తున్నాం. ఉత్తరాఖండ్‌లో గతంలో వచ్చిన అతి భారీ వర్షాలు, వరదలు అందరికీ ఇబ్బందులు కలిగించాయి. ప్రకృతిలో మనం భగవంతుడ్ని చూడాలి. వాస్తవం చెప్పాలంటే ప్రకృతే భగవంతుడు. ప్రకృతి పూజించడమంటే భగవంతుడ్ని పూజించడమే. హిమాలయాల్లోని ‘‘చార్‌ధామ్’’ క్షేత్రాలు అతిపవిత్రమైనవి. ఈ క్షేత్రాల్లో వేల సంవత్సరాల నుంచి రుషులు తపస్సు చేస్తూ, పృథ్వీమాత రక్షణ కోసం పాటుపడుతూ వస్తున్నారు. ప్రకృతికి అనుగుణంగా వేల సంవత్సరాల నుంచి మనుషులు జీవిస్తూ వస్తున్నారు. పంచభూతాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇంతకాలం చూస్తూ వుండటం వల్ల గతంలో ఏనాడూ ఉత్పాతాలు జరిగినట్లు దాఖలాల్లేవు. ఏనాడూ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.
సహజంగా వుండే పర్వతాలను, హిమాలయాలను తొలచివేస్తున్నాం. నదీ ప్రవాహాలు సజావుగా కొనసాగకుండా అడ్డుకుంటున్నాం. అడవులను తొలగిస్తున్నాం. పవిత్రమైన గంగను కూడా కలుషితం చేశాం. ఈ కారణాల వల్ల ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిన్నది. ప్రశాంతత ఉండాల్సిన చోట బీభత్సం చోటు చేసుకుంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ప్రకృతి వైపరీత్యాలను చూడాలి. ప్రకృతి మనపై యుద్ధం ప్రకటిస్తే, మనం నిలువలేం. మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో అన్ని దేశాల అధినేతలు కలిసి పంచభూతాలను రక్షించేందుకు ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. మనిషి మేధస్సు పెరిగే కొద్దీ ప్రపంచ శాంతి కోసం అది ఉపయోగపడేలా వుండాలి తప్ప, విధ్వంసం కోసం ఉపయోగపడకూడదు.