కుటుంబ వ్యవస్థతోనే దేశం : ఉప రాష్ట్రపతి ధన్కర్
భారతీయ సంస్కృతిలో కుటుంబ ప్రబోధన్ (కుటుంబ విలువల బలోపేతం) కూడా అంతర్లీనంగా వుంటుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. భారతీయ సంస్కృతిలో కుటుంబానిదే ప్రధాన సూత్రమని అన్నారు. ఉజ్జయినిలో జరిగిన కాళిదాసు ఉత్సవంలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా కుటుంబం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. భారత దేశంలో కుటుంబమే ప్రధానమని, కుటుంబం పట్ల శ్రద్ధ వహించకపోతే జీవితమే అర్థవంతం కాదన్నారు. మన ఇరుగు పొరుగున వున్న వారి సాధక బాధకాలు తెలుసుకోవాలని, వారికి ఎలా సహాయం చేయవచ్చో ఆలోచించాలన్నారు. ఇలా చేస్తేనే జీవితం సంపూర్ణమవుతోందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతికవాదం వైపు మళ్లుతున్నారని, కావల్సిన వారిని కూడా విస్మరించేంత బిజీ బిజీ అయిపోయారన్నారు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
హక్కులను నొక్కి చెప్పడం ద్వారా సమాజం లేదా దేశం ముందుకు సాగదని, రాజ్యాంగం హక్కులను కల్పిస్తున్న మాట నిజమేనని అన్నారు. అయితే.. హక్కులతో పాటు విధులను కూడా సమతౌల్యం చేసుకుంటూ ముందుకు సాగాలని ధన్కర్ సూచించారు. పౌరులకు బాధ్యతలు కూడా వుంటాయని, అందుకే వాటిని ఆచరించాలన్నారు. అందరూ గొప్ప పౌరులని, భారతీయత మన గుర్తింపు అన్నారు. మన దేశమే గొప్ప మతమని అన్నారు. అన్నింటి కంటే దేశమే ప్రధానమని, అదే అత్యున్నతమని పేర్కొన్నారు. అయితే… కర్తవ్యాలను నెరవేర్చడమే ఉత్తమ మార్గమని, అదే దేశసేవ అన్నారు.
పిల్లలే ఈ దేశ భవిష్యత్తు అని, వారిలో నైతికతను పెంపొందించాలని ఇది పౌరుల ప్రాథమిక బాధ్యత అని అన్నారు. తమ తమ పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు… మరొకటి.. మరొకటి కావాలని ఆశించడంలో తప్పు లేదు కానీ.. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే బాధ్యతాయుత పౌరునిగా వారి విధులు నిర్వర్తించేలా ఎదగాలని ఆకాంక్షించారు.