భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిరూపమే నోములు, వ్రతాలు
ఎక్కడన్నా ఒక రోజు ప్రత్యేకం కావచ్చు, ఒక వారం ప్రత్యేకం కావచ్చు. కానీ శ్రావణ మాసంలో ప్రతి దినమూ పండుగే, ప్రతి వారమూ విశిష్టమే. అందుకే దీన్ని ఆధ్యాత్మిక సంపదలనొసగే మాసంగా పిలుచుకుంటాం. ఎందుకంటే… శ్రావణ మాసం అంటే శుభప్రదమైన మాసం అని అర్థం. శ్రావణ మాసాన్ని ‘నభో మాసం’ అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. అంతటి మహిమా న్వితమైన మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చు. పైగా శ్రవణ అంటే వినడం అన్న అర్థం కూడా ఉంది కదా! ఈ మాసంలో అమ్మవారికి చేసే ప్రార్థనలను ఆమె తప్పక వింటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని కూడా అంటారు.
చంద్రుడు, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న మాసం కాబట్టి దీన్ని శ్రావణమాసం అని మనం పిలుస్తాం. శ్రవణ నక్షత్రం మకరరాశిలో ఉంటుంది. శనిదేవుడు అధిపతిగా కలిగిన రాశి మకర రాశి. ఇక శని దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆధీనంలో ఉంటాడు. తిరుమల కొండల్లో కలియుగ దైవంగా కొలువై ఉన్న శ్రీవారిది కూడా శ్రవణ నక్షత్రం కావడం విశేషం. అందుకే ఈ మాసంలో శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే శనీశ్వరుని బాధలు తొలిగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ మాసంలోనే సాక్షాత్తూ గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు పుట్టాడు. అలాగే విష్ణువు అవతారమైన హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే సంభవించింది. ఆధునిక యుగంలోని ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే జన్మించారు. ఆళవందారు, బదరీ నారాయణ పెరుమాళ్?, చూడికుడుత్త నాచ్చియార్? తదితరుల తిరు నక్షత్రాలు కూడా ఈనెలలోనే ఉన్నాయి. ఇక గరుడుడు అమృతభాండాన్ని సాధిం చింది ఈ నెలలోని శుద్ధ పంచమి, అదే.. నాగులపంచమి పర్వదినం. ఇక మహిళలకు కూడా ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ సోమవార వ్రతం, పొలాల అమావాస్యలాంటి పండుగలన్నీ ఈనెలలోనే ఉంటాయి. శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజా ఫలీకృతమై ఉంటుందని అంటారు పెద్దలు.
మన తెలుగు నాట, ప్రత్యేకించి ఏ వ్రతం చేసినా సరే పేరంటాల సందడి, శనగలు, అరటి పండ్లు, తాంబులాలతో కూడిన హడావుడి దాదాపు అందరిళ్ళలోను కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెవిన పడేది ‘‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం!’’ అంటే వాయనాలు, తాంబూలాలు ఇవ్వటం, పుచ్చు కోవటం అన్నమాట. ఈ ఆచారం అనాదిగా మన సంస్కృతిలో జీర్ణించుకుని పోయింది. ఇది ఒక అందమైన ఆనందమైన ఆచార వ్యవహారం అనే చెప్పొచ్చు. ఎందుకంటే, ఏదైనా వస్తువు ఇవ్వటంలో ఉన్న సంతోషం, అది తీసుకున్నప్పుడు కూడా రెట్టింపు అవుతుంది.
ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు మనకు పురాణ కాలం నుండి కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని పురాణాలలో అప్పుడపుడు ఈ ప్రసక్తులు కూడా ఉన్నట్లు పెద్దవారు చెప్తుంటారు. శ్రీ రామాయణంలో సీతామాత శ్రీరామచంద్ర మూర్తితో మహా సాధ్వులైన అరుంధతి, అనసూయల కుటీరానికి విచ్చేసినపుడు వారు సీతారాములను పసుపు కుంకుమలు, దివ్య వస్త్రాలతో సత్కరించి తమ అభిమానాన్ని చూపించారని తెలుస్తోంది.
కనుక ఎవరైనా అతిథులు, పెద్దవారు మన ఇంటికి వచ్చినపుడు వారికి తగు మర్యాదలు చేసి, వారికి భోజనంతో పాటుగా వస్త్ర, తాంబూలాలతో సత్కరించటం, వారి పట్ల మనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ప్రకటించినట్లే అని చెప్తారు. ఇక ఇంటి ఆడపడచులు, అక్కచెల్లెళ్ళకి ఎల్లపుడూ ఆ కుటుంబంలో ప్రత్యేక స్థానమే. వారు వస్తే తప్పక పసుపు కుంకుమ, చలివిడితో పాటుగా తాంబూ లాది వస్త్రాలను సమర్పించటం ఆ కుటుంబం ఆప్యాయత, బాంధవ్యాలను ప్రకటించేదిగా చెప్పబడుతుంది. రకరకాల బాంధవ్యాలతో నిండిన మన భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచమంతటికీ ఆదర్శప్రాయమే! ఆ కుటుంబ వ్యవస్థను పదిలపరుచు కోవడానికి మన పెద్దలు మనకు చెప్పిన మార్గమే ఈ నోములు, వ్రతాల పేరుతో సంబంధ బాంధ వ్యాలను ఏర్పరుచుకోవడం. తద్వారా కుటుంబ హితమే కాదు సమాజహితం కూడా కోరిన వారమవుతాం.
– లతాకమలం