హైదరబాద్ లో 750 ఎకరాలు మావేనంటున్న వక్ఫ్…
హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతంలోని వాసులపై వక్ఫ్ పిడుగు పడిరది. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని వందకు పైగా సర్వే నెంబర్లలో ఆస్తుల క్రయ విక్రయాలను నిలిపేస్తూ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది. దీంతో స్థానికుల్లో కలవరం ప్రారంభ మైంది. ఎందుకు అని అంటే.. నియోజకవర్గంలోని పలు సర్వే నెంబర్లలో 750 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలాలని నోటిఫై అయ్యింది. ఈ విషయాన్ని మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ శాఖే ప్రకటించింది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్ ఆదేశాలతో క్రయ విక్రయాలు నిలిపేసినట్లు అధికారులు ప్రకటించారు.
అయితే.. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మల్కాజిగిరి లోని పలు భూములను వక్ఫ్ ఆస్తులని, వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని పలు సర్వే నెంబర్లను పేర్కొన్నారు. అంతేకాకుండా మేడ్చల్ జిల్లా కలెక్టర్ తో పాటు రిజిస్ట్రేషన్ అధికారులకు కూడా లేఖలు పంపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ లేఖలు పంపడంతోనే ఆస్తుల క్రయ విక్రయాలు ఆగిపోయాయి. అలాగే ఆ ఆస్తులు వక్ఫ్ ఆస్తులని పేర్కొంటున్నారు. అయితే… చాలా సంవత్సరాలుగా అవి తమవేనని, మధ్యలో వక్ఫ్ ఇప్పుడు వచ్చి, తమ ఆస్తులని ప్రకటించడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా మౌలాలి, ఆర్టీసీ కాలనీ, షఫీనగర్, తిరుమలనగర్, భరత్ నగర్, ఎన్ బీహెచ్ కాలనీ, తూర్పు కాకతీయనగర్, ఓల్డ్ సఫిల్ గూడా, న్యూ విద్యానగర్, రామబ్రహ్మనగర్ తదితలు కాలనీలను వక్ఫ్ తమదిగా పేర్కొంది.