1200 ఎకరాల్లో వక్ఫ్ మోసం..
కర్నాటక వక్ఫ్ బోర్డు రైతులను నిలువునా మోసం చేసింది. రాత్రికి రాత్రే రైతుల భూములను తమవని రికార్డులను తారుమారు చేసేసింది. ఇది జరిగింది విజయపురలో. ఏకంగా 1200 ఎకరాల రైతుల భూములు వక్ఫ్ భూములని ప్రకటించుకుంది. ఇంతకు ముందు ఆ భూముల రికార్డుల్లో వక్ఫ్ అని లేనేలేదు. రాత్రికి రాత్రి వక్ఫ్ అని వచ్చిపడిరది. ఈ డాక్యుమెంట్ల ట్యాంపరింగ్‌పై సోషల్ మీడియాలో కూడా వచ్చింది. గత మూడు వారా ల్లోనే ఈ రికార్డుల తారుమారంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోయినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆర్టీసీలో రికార్డ్ ఆఫ్ రైట్స్, టెనన్సీ అండ్ రికార్డ్స్ ఆఫ్ క్రాప్స్‌లో మ్యుటేషన్ జరిగినట్లు అంటున్నారు.
అయితే ఇంత ప్రక్రియ జరిగినా రైతులకు మాత్రం ఎవ్వరూ చెప్పనేలేదు. వారు కూడా గ్రహించలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెంది, ఆగ్రహం వ్యక్తం చేయడం, వ్యవహారం కూడా బయటికి పొక్కడంతో కర్నాటక సర్కార్ అప్రమత్త మైంది. దీనిపై వివరణ ఇచ్చుకుంది. గెజిట్ నోటిఫికేషన్‌లో వున్న లోపం వల్లే ఇలా జరిగిందని మంత్రి హెచ్.కే. పాటిల్ చెప్పుకొచ్చారు. రైతుల భూములను వక్ఫ్ భూములుగా మార్చే ఉద్దేశం తమకు లేదని, తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని చెప్పారు. జారీ చేసిన నోటీసులను కూడా ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించారు.