యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు : మనోజ్ నరవాణే

యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని, ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవాల్సి వస్తుందని భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవాణే అన్నారు.  పూణెలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (పుణె చాప్టర్) వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధం అనేది రొమాంటిక్ గా వుండదన్నారు. చాలా తీవ్రమైన అంశమని, యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా వుండాలన్నారు.
యుద్ధం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి దారుణంగా వుంటుందని, షెల్లింగ్ ను చూడగానే చిన్న పిల్లలు సైతం రాత్రికి రాత్రే సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తాల్సి వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో ప్రియమైన వారిని కోల్పోతే ఆ వేదన అనేది వారికి తరతరాలుగా వుండిపోతుందన్నారు.యుద్ధం తీవ్రమైన అంశం కాబట్టే, ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని అన్నారని నరవాణే గుర్తు చేశారు. తెలివి లేని వారి వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితే ఏర్పడ్డా… దాన్ని నివారించేందుకే మొగ్గు చూపాలని స్పష్టం చేశారు.
ఈ సమయంలో పూర్తి స్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని కొందరు అడుగుతున్నారని, ‘‘సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా యుద్ధానికి వెళ్లేందుకు నేనూ సిద్ధమే. కానీ.. దౌత్యాన్నే తొలి అవకాశంగా ఎంచుకుంటా. చర్చతోనే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటా’’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి దుస్సాహసాలకు పాల్పడటం మానేయాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బలమైన సందేశాన్నే పంపిందని, ఇలాగే పాక్ వ్యవహారముంటే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నరవాణే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *