చెత్తతో అద్భుతాలు… ఆదిలాబాద్ మున్సిపల్ సిబ్బంది ఘనత

అందరూ వాడి పడేస్తున్న వ్యర్థాల నుంచి సంపద సృష్టి చేయవచ్చు. అలాగే కొన్ని అద్భుతాలను కూడా సృష్టించొచ్చు. ఆదిలాబాద్ మున్సిపల్ సిబ్బంది ఇదే చేశారు. స్థానిక గాంధీ పార్క్ లో వ్యర్థాలతో అద్భుతాలు చేసి, అందరినీ ఆకర్షిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగం పలు రకాల కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ ఇతర వస్తువులతో పర్యావరణానికి దోహదపడే విధంగా వినూత్నంగా ఏదైనా చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆలోచించారు. ఈ పనిని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ పనిని పర్యవేక్షించే బాధ్యతను అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రాకు అప్పగించారు. ఆమె పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది తమ సృజనతో వ్యర్థమని పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను రూపొందించారు. వాటన్నింటిని జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ప్రదర్శన పెట్టారు. మున్సిపల్ సిబ్బంది సృజనాత్మకతను కలెక్టర్ అభినందించారు.

‘‘వేస్ట్ టు వండర్’’ పేరుతో ఓ పార్క్ ను ఏర్పాటు చేశారు. రోజూ పురపాలక సంఘంలో పోగయ్యే పొడి చెత్తలోని ప్లాస్టిక్ బాటిళ్లు, వాహన టైర్లు, ఇనుప ముక్కలతో పాటు తదితర వ్యర్థ వస్తువులతో బొమ్మలను తయారు చేశారు. వాహన టైర్లలో సుమారు 100 కి పైగా పూల మొక్కలను పెంచుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలతో ఇలా తీర్చిదిద్దారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *