జాతీయవాదం అంటే ఏమిటి?

హిరణ్య పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌జ్యేష్ట ప్రచారక్‌ ‌రంగా హరి జాతీయవాదం, హిందూత్వం, పునరుజ్జీవనం వంటి అంశాల గురించి మాట్లాడారు.‘పునరుజ్జీవనం అంటే మన శాశ్వత విలువలను జాగృత పరచుకోవడం, ఆచరణలోకి తెచ్చుకోవడం’ అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

‘అహం రాష్ట్రి సంగమని చికిత్సుషి ప్రథమా యాజ్ఞియానామ్‌’ అని వేదం చెపుతుంది. అంటే దీని అర్ధం ‘రాష్ట్ర దేవత’ (దేశమాత) అందరికంటే పూజనీయురాలు. ఈ విషయాన్ని మీరు ఎలా వివరిస్తారు?

వేదాల్లో అనేకమంది దేవతలు కనిపిస్తారు. అయితే దేశ, కాల, పరిస్థితుల ప్రకారం అనేకమంది దేవతలు, వివిధ పేర్లతో కనిపిస్తున్నా నిజానికి వారంతా ఒకే దైవమని స్వామి దయానంద సరస్వతి సోదాహరణంగా నిరూపించారు. దీనిని బట్టి రాష్ట్ర దేవతను ప్రత్యేకమైన దైవ స్వరూపంగా, దైవంగా చెప్పడం సరికాదని నేననుకుంటాను. మరి ఇది ఎలా అర్ధం చేసుకోవాలన్న ప్రశ్న పుడుతుంది. మనం రాష్ట్రం, దేశాన్ని ఒక ప్రత్యేక దేవతగా చెపుతున్నమంటే అది దైవానికి స్వరూపంగా భావిస్తున్నామనే అర్ధం. ఇక్కడే మనం ‘ఏకం సత్‌’ అనే మాట గుర్తుతెచ్చుకోవాలి. ఏకం సత్‌ అం‌టే ‘ఒక్కటే, రెండవది లేదు’ అని అర్ధం. కాబట్టి రాష్ట్ర దేవత ప్రత్యేకమైన దైవమని చెప్పలేము. ఏకైక దైవానికి ఒక స్వరూపం మాత్రమే. అంటే దైవమే. మనం రాష్ట్రం (జాతి), దేశం గురించి ప్రత్యేకంగా చెపుతున్నామంటే దాని గురించి విశేషంగా ఆలోచిస్తున్నాము, మాట్లాడుతున్నామని మాత్రమే అర్ధం.

అంటే రాష్ట్రానికి (జాతికి) విశేష ప్రాధాన్యత నివ్వాలని వేదాలు చెపుతున్నాయా?

కేవలం ప్రాధాన్యత విషయం మాత్రమే కాదు. అవసరం, ఆవశ్యకత కూడా. వేదాలు ప్రతి వ్యక్తి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మానవజాతిని వివిధ సమూహాలుగా గుర్తించాయని, ప్రతి సమూహానికి ప్రత్యేకమైన పేరు కూడా పెట్టాయని కూడా మనకు తెలుస్తుంది. సమితి, సభ, సంహతి, విశ, విధాత, మొదలైనవి ఆ పేర్లు. అలాగే గ్రామ, జానపద, రాష్ట్ర వంటివి వివిధ కాలాల్లో, పరిస్థితుల్లో ఏర్పడిన వ్యవస్థలు. పైపైన కంటే మనం లోతుగా పరిశీలిస్తే వేదాలలో చెప్పిన విషయాలు సరిగా అర్ధమవుతాయి.

సావర్కర్‌, ‌గాంధీజీలు 20 శతాబ్దంలో జాతీయవాదాన్ని గురించి మాట్లాడిన ప్రముఖులు. జాతీయవాదం దృష్ట్యా మీరు వీరిలో ఎవరికి దగ్గరగా ఉన్నారని భావిస్తారు?

మన జాతి పునరుజ్జీవన చరిత్ర చూస్తే, ఆ మాటకొస్తే ప్రతి దేశానికి, ఒక ఆత్మ ఉంటుందని, ప్రపంచానికి అందించవలసిన సందేశం ఒకటుంటుందని తెలుస్తుంది. 19వ శతాబ్దపు చివరలో, 1897లో రామేశ్వర్‌ ‌దగ్గర స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘ప్రతి దేశానికి ప్రపంచానికి అందించవలసిన సందేశం, నెరవేర్చవలసిన కార్యం ఒకటి ఉంటుంది’ అని అన్నారు. అప్పటి వరకు ఏ దేశ నాయకుడు ఇలా మన దేశం నిర్వహించాల్సిన పాత్ర ఒకటుందని చెప్పలేదు.

స్వామి చెప్పిన ఈ రాష్ట్రత్వమే ఆ తరువాత ఆర్‌ ఎస్‌ ఎస్‌ అనుసరించిన రాష్ట్రత్వం అయింది. గాంధీజీగాని, సావర్కర్‌ ‌గాని ఈ భావనను ప్రతిపాదించలేదు. ప్రతి దేశపు ఆత్మే ఆ దేశం ప్రపంచానికి ఇచ్చే సందేశంలో ప్రతిఫలిస్తుంది. ప్రతి దేశం ప్రపంచానికి ఇచ్చే సందేశం ఉంటుంది కాబట్టి అన్నీ దేశాలకూ విలువ ఉంటుంది.

‘హిందూమతం’ (హిందూ ఇజం) మంచిదైనా ‘హిందూత్వం’ సరైనది కాదని, దానిని వ్యతిరే కించాలన్న ఆలోచన సాధారణంగా కనిపిస్తుం టుంది. అయితే అవి రెండూ వేరువేరా? వేరైతే వాటి మధ్య తేడా ఏమిటి?

నిజమే వాటి మధ్య తేడా ఉంది! కానీ ఆ తేడా ఆంగ్ల విద్య వల్ల, ఆంగ్ల ప్రమాణాలను ఉపయోగించడం వల్ల కలుగుతోంది. ఆంగ్ల ప్రమాణాలను ఉపయోగించి ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనం గందరగోళానికి గురవుతాం. మన ప్రాచీన సాహిత్యంలో ఎక్కడా ‘హిందూ ఇజం’, ‘హిందుత్వం’ పదాలు కనిపించవు.  జీసస్‌ ‌క్రీస్తు మతవిశ్వాసాలను అనుసరించేవారంతా ఒక సమూహంగా ఏర్పడ్డారు. వారే క్రైస్తవులు. అంటే క్రీస్తు వ్యక్తిగత మతవిశ్వాసాలు ఒక సమూహపు విశ్వాసాలు అయిపోయాయి. ఇదే ధోరణిలో ఇంగ్లీష్‌ ‌వాళ్ళు ఇస్లాంను మహమ్మద్‌ ఇజం (మహమ్మడ నిజం) అన్నారు. ఇలా ఆంగ్ల వ్యాకరణంలో ప్రతీదీ ‘ఇజం’గానే చెపుతారు. ఈ మాట కేవలం మతానికే పరిమితం కాలేదు. మనకు మెకాలే ఇజం, హిట్లర్‌ ఇజం మొదలైన మాటలు కూడా కనిపిస్తాయి.

కానీ భారత్‌లో ఇదే మాటను, ప్రమాణాన్ని ఉపయోగించినప్పుడు గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేవతను ప్రముఖంగా పూజిస్తారు. బెంగాల్‌ ‌లో దుర్గాదేవిని పూజిస్తే, ఉత్తర్‌‌ప్రదేశ్‌లో రాముడు, ద్వారకలో కృష్ణుడిని ఆరాధిస్తారు. ఇక దక్షిణ భారతానికి వస్తే కూడా అంతే. జీసస్‌ ‌క్రీస్తు పేరుపై క్రైస్తవం ఏర్పడింది. మహమ్మద్‌ ‌ప్రకారం ఇస్లాం వచ్చింది. అందుకని వాటిని ఆయా ‘ఇజాలు’ అని గుర్తించారు, పిలిచారు. కానీ ఇక్కడ అలా వేరువేరు దేవతలకు వేరువేరు మూలాలు వారికి కనిపించలేదు. వారి రోజుల్లో ఇక్కడి ప్రజానీకానికి ‘హిందువులు’ అనే భౌగోళిక నామం వాడుకలో ఉంది. అందుకని వారి లెక్కప్రకారం ఆ ప్రజలందరి మత విశ్వాసాలకు ‘హిందూ ఇజం’ అని పేరు పెట్టేశారు. అంటే అది కేవలం మతపు పేరు అన్నమాట! కానీ హిందూత్వం అనే మాట మతాన్ని సూచించదు. దానిని ‘హిందూతనం’ అనవచ్చును. అది హిందువు ఆలోచన, తత్వాన్ని తెలుపుతుంది. ఏదైనా వస్తువును, పదార్ధాన్ని కొలిచినప్పుడు చివరలో కొసరు వేయడం మనకు దేశమంతటా కనిపిస్తుంది. దీనినే ఎర్నాకులంలో ‘వాష్‌’ అం‌టారు. ఈ కొసరు లేదా వాష్‌ ‌వేయాలనే నిబంధన, నిర్బంధం ఏమి లేదు. తమిళనాడులో పల్లీలు మొదలైన ఏ పదార్ధం కొన్న చివరలో కొన్ని అదనంగా వేస్తారు. ఆ కొసరు ఇవ్వకపోతే మనం ఆ వ్యాపారిని అడగడానికి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు.

కానీ నిరక్షరాస్యులైన వ్యాపారులు కూడా కొసరు తప్పక ఇస్తారు. దీనినే తమిళనాడులో ‘కొసర’ అని, కన్నడం, తెలుగుల్లో ‘కొసరు’, ఉత్తర్‌‌ప్రదేశ్‌లో ‘జుంగా’, బెంగాల్‌లో ‘హోవా’ అని అంటారు. ఈ పద్దతి దేశం అంతటా కనిపిస్తుంది. అయితే ఇలా కొసరు ఇవ్వాలని ఏ శాస్త్రంలో వ్రాసి ఉంది? ఎక్కడా లేదు. మరి ఇది ఎందుకు పాటిస్తున్నారు? ప్రాచీనకాలం నుంచి ఇది పాటిస్తున్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. అదే హిందూత్వం. ఈ పద్దతిని భారత్‌ ‌బయట ఎక్కడా, ఎవరూ పాటించరు. ఇది మతంలో భాగమా? కానేకాదు. కాబట్టి అది హిందూ ఇజం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *