’వేయి పడగలు‘లోని అంతరార్థమిదీ…. విశ్వనాథ వారి మాటల్లోనే
వేయిపడగలలో అంతరార్థమేమిటి? ఒక గ్రంథం ఏ ఉద్దేశంతో రాయబడుతుందో అదే దాని అంతరార్థం. ఆ ఉద్దేశం కనుక్కోవడం ఎలా? అసలు మొదట కవి నేర్పుకలవాడైతే తన ఉద్దేశాన్ని కావ్యంలో సువ్యక్తం చేస్తాడు. సువ్యక్తం చేయడమంటే వాచ్యంగా చెప్పడం కాదు. వాచ్యంగా చెబితే, అది ఉత్తమ కావ్యమే కాదు. నేర్పుగల పాఠకుడు జాగ్రత్తగా ఊహిస్తే అది అతనికి తెలిసినట్లు రాస్తాడు. పూర్వం నుంచి మన దేశంలో నేర్పుగల కవి తన ప్రధానోద్దేశాన్ని కావ్యంలో ఏర్పరిచేందుకు కొన్ని మార్గాలు వున్నాయి. వాటిని పారిభాషికంగా ‘‘లింగములు’’ అన్నారు. కావ్యము దేనితో ఉపక్రమిస్తున్నాడు – అంటే మొదలుపెడుతున్నాడు. దేనితో ఉపసంహరిస్తున్నాడు- అంటే కావ్యం చివర దేనిని చెప్పాడు. సామాన్యంగా నేర్పరియైన రచయిత కావ్యానికి మొదటా చివరా కావ్యంలో తాను చెప్పదలుచుకున్న అంతరార్థాన్ని నిక్షేపిస్తాడు.దానిని బట్టే ప్రధానంగా ఆ కావ్యంలో వున్న అర్థం తెలుస్తుంది. మరిన్ని ఈ విషయాన్నే తన కావ్యంలో బహుస్థలాల్లో చెబుతూ వుంటాడు. ఇవి మూడు ప్రధానంగా కావ్యం యొక్క అంతరార్థాన్ని తెలియజేస్తాయి. నేర్పులేని కవి యిల్లా చేసుకోలేడు. దేనితోనో మొదలు పెడతాడు. మరేదో చివరికి తేలుస్తాడు. మధ్య అతని యిష్టం వచ్చినట్లు రాస్తాడు. దీనినే మృచ్ఛకటికంలో శూద్రక మహారాజు విదూషకుని చేత ఆక్షేపింపజేశాడు. ఏమంటే ఏ కుకవి కావ్యము వలె బీజంలో ఒకటి, నిర్వహణములో ఒకటియని. కావ్య ప్రయోజనం సరే, ఒక్కొక్కప్పుడీ ప్రయోజనం యింకొక దాని మీద ఆరోపితమై వుంటుంది. ఇంచుమించుగా ఒక రూపకాలంకారం మల్లే వుంటుంది. అచ్చంగా రూపకమైతే తెలుస్తుంది. ఏక దేశరూపకమైతే మరికొంచెం కష్టమవుతుంది.
ఇల్లా కాకుండా కొన్ని చోట్ల వ్యాజంగా వుంటుంది. అప్పుడు సామాన్య పాఠకునికి మరీ అందదు. ఈ లక్షణాలన్నీ వేయిపడగలలో వుండటం మూలంగా కొందరికి చప్పున అవగతం కాకపోవడంలో దోషమేమిన్నీ లేదు. తక్కినవన్నీ యెలావున్నా ఇందులో ‘‘పసిరిక’’ అన్న పాత్ర కొంతమందికి అర్థం కావడం కష్టం కలిగించింది. కవి ఎప్పుడూ ఆలోచిస్తే అర్థమయ్యేట్టే రాస్తాడు. ఇందులో రామేశ్వర శాస్త్రి నాలుగు వివాహాలు చేసుకున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కన్యలను. ఇది సాంకేతికమైన విషయం. యథార్థ విషయము కాదు. శాస్త్రం అంగీకరించిన విషయమైనా కవి దానిని ఉద్దేశించలేదు. ఈ గ్రంథంలో ప్రతి చోటా ధర్మమును గురించే చెప్పబడుతూ వచ్చింది. పుస్తకము పేరే ‘‘వేయి పడగలు’’సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ దేవత. ఈ తెలుగు దేశంలో సుబ్రహ్మణ్యుడ్ని పాముగా ఆరాధిస్తారు. ఆయన ఆదిశేషువు. ఆదిశేషునకు వేయి పడగలున్నాయి. ఆ వేయి పడగల మీద భూమిని వహిస్తున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. భూమిని సుబ్రహ్మణ్యేశ్వరుడు మోస్తున్నాడన్న మాట పౌరాణికమైన మాటగాని ఖగోళ విషయం కాదు. అనగా సహస్రముఖంగా ధర్మం వుంటుంది. ఆ ధర్మం చేత భూమి పాలించబడుతుంది అన్నయర్థమే. సర్వత్రా ధర్మమే వుంటే అది సహస్ర ముఖంగా వున్నదని చెబుతాం. అది వేయిపడగలు. సుబ్బన్నపేట గ్రామాధకారి నాలుగుపడగల పామును చూస్తాడు. ఇది చాతుర్వర్ణ ధర్మము. చివరికి ఒక పడగే కనిపిస్తుంది.
అది అంతా కలిసి యేకరూపమైన ధర్మం. ఈ విషయం జాగ్రత్తగా చదివే పాఠకుడికి కావ్యం మొత్తం మీద తెలుస్తుంది. రామేశ్వర శాస్త్రి నాలుగు వర్ణములలో నుంచి వివాహం చేసుకున్నాడంటే యిదంతా వట్టి సాంకేతికము. ఈ దేశంలో ప్రధాన మతము వేదమతము. వేదాలు నాలుగు. వర్ణాలు నాలుగు. నాలుగు వర్ణాలు వేద ధర్మాన్ని అనుసరించేవే కదా. అనాదిలో సంఘాన్ని పూర్వరుషులు నిర్మించినపుడు వేదమును రక్షించేందుకు బ్రాహ్మణుని నియమించారు. అన్ని వర్ణాల యందు అతడు వేద ధర్మాన్ని రక్షించాలి. అనగా అన్ని వర్ణాల వారు తమ తమ వర్ణానుకూలంగా తమ ఆచారాల ప్రకారం తమ విధులను అనుసరించి వేద ధర్మాన్ని పాలిస్తే.. సంఘం సువ్యవస్థితంగా వుంటుంది. ధర్మం సహస్రముఖంగా వర్ధిల్లుతుంది. వేయిపడగలు భద్రంగా వుంటాయి. ఇందులో వున్న సుబ్బన్నపేట ఒక ఊరు కాదు; దేశానికంతటికీ అది చిహ్నము. జమీందారు జమీందారు కాడు. చాలా మంది ఇందులో వున్న జమీందారీ జమీందారీయని, అది జమీందారీ విధానాన్ని సముద్ధరిస్తున్న పుస్తకమనీ అనుకోవడం జరిగింది. ఇక్కడ జమీందారు రాజస్థానీయుడు. రాజనగా ఒక్క వ్యక్తే రాజుకాడు. దేశాన్ని పాలించినవారందరూ కలిసి ఒక రాజు. ఒక రాజే రాజ్యం చేసినప్పుడు కూడా ఆ రాజు ఒక్కడే చేయలేడు. దేశం మొత్తం మీద కొన్ని వేల మంది రాజును అనుసరించేవారుంటే, వారి ద్వారా రాజు పాలించాడు. వేయి వ్యవహారాల్లో మరీ ఇతరుల చేత తెగతెంపులు కాని ఒక వ్యవహారం వుంటే దానిని రాజు తీర్చేవాడేమోకానీ, తక్కినవన్నీ రాజాధికారులే చేసేవారు. ఒకనియందు అనుగ్రహముంటే ఆ రాజు వానిని శిక్షించడం మానివేయవచ్చు; ప్రజాస్వామికంలో కూడా రాష్ట్రాధ్యక్షుడు నూటికి కోటికి అట్టి క్షమాపణ చేయడం వున్నది. ఒక రాజు పాలించటమని, కొందరు పాలించటమని, ప్రజలే పాలించుకోవటమనీ యివన్నీ పేర్లేకాని యదార్థానికి అన్ని దేశాలూ యెప్పుడూ చాలా కొంచెం భేదాలతో ఒకటే మోస్తారుగా పాలించబడుతూ వుంటవి. కనుక యిక్కడ జమీందారంటే పాలకవర్గమని అర్థం. విజాయతీయమై భావాలకి లొంగిపోయి సంప్రదాయము స్వజాతిలక్షణము మరచిపోయిన పాలకవర్గము యిక్కడ జమీందారు చేత ఉద్దేశింపబడినది.
జమీందారు రంగారావు కొడుకు హరప్ప జమీందారే కానీ అతని యందు ధర్మం సురక్షితమైందని చెప్పబడినది. ఎందుకంటే, అతడు దైవ భక్తుడు. విద్యలను రక్షిద్దామనేవాడు. దేశం యొక్క సంప్రదాయములందు అభిమానం జాస్తి. సాధువు, నియమవంతుడు. తన డబ్బు తీసికెళ్లి గుర్రపు పందాలమీద బెట్టడు. పోయి మద్రాసులో మకాము వేయడు. గుర్రపు పందాలంటే గుర్రాలు, పందాలు కావు. విజాతీయ సంస్కృతి వ్యామోహానికి అది చిహ్నం. మదరాసంటే మదరాసు కాదు. అనాది నుంచీ యీ దేశం గ్రామ నాగరికత కలది. మదరాసు పట్టణం నాగరికతకు చిహ్నం. లక్షలాది పల్లెటూళ్లు ప్రధానవృత్తి వ్యవసాయం కల యీ దేశము ప్రధానంగా పరిశ్రమలు కల దేశాల యొక్క నాగరికతను అవలంబించి చెడిపోతున్నదని తాత్పర్యం. అధికారులకు, ప్రజలకు సంబంధమే లేదు. ధనవంతులూ, అధికారులూ రాజ్యం చేస్తున్నారు. ఈ విషయం ఈ కావ్యంలో నిందింపబడింది.
ధర్మారావు పేదవాడు. చదువుకొన్నవాడు. సాధువు. పూర్వసంప్రదాయాలందు ఇష్టం కలవాడు. అనగా ఆ భావములకు ప్రతినిధి. కావ్యము నందున్న వ్యక్తి సామాన్యంగా ఆ వ్యక్తి కాడు. అతడే భావాలకి ఆధారభూతుడవుతాడో ఆ భావాలకు లక్ష్యభూతుడుగా అనుకోవాలి.
కావ్యాలు సామాన్యంగా రెండు విధాలు. మొదటిది రస ప్రధానమైన కావ్యం. రెండోది భావ ప్రధానమైన కావ్యము. రస ప్రధానమైన కావ్యాలలో అక్కడక్కడ భావ ప్రధానమైన భాగాలు వుండవచ్చు. భావ ప్రధానమైన కావ్యంలో కూడా చాలా చోట్ల రస సాక్షాత్కారం కావచ్చు. ఇక్కడ భావమంటే ఒక ధర్మమని అర్థం. కావ్యంలో చెప్పబడే భావం కాదు. ఒక ధర్మాన్ని ప్రధానంగా బోధించేందుకు ఒక కావ్యం రాయబడుతుంది. ఆ కావ్యంలో వున్న పాత్రలు ఒకానొక ధర్మానికి సాంకేతిక పురుషులుగా వుంటాడు. ఈ పేదవాడైన ధర్మారావు సంప్రదాయసిద్ధమైన విద్యా సంస్కృతులయందు అభిమానం కలిగిన ధర్మారావు జమీందారు చేత, తక్కిన సంఘం చేత నిరాదరింపబడ్డాడో ఈ కావ్యంలో ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. అనగా పాలకవర్గం ధనికులు సంప్రదాయాన్ని, దేశీయ పాండిత్యాన్ని, దేశీయమైన సంస్కారాన్ని నిరాదరిస్తున్నారని దీని తాత్పర్యం.
సుబ్బన్న పేట యీ దేశానికంతటికీ లక్ష్యభూతమైన గ్రామంగా చెప్పబడింది. అందుకనే ఆ వూరు పేరు సుబ్బన్నపేట. సుబ్రహ్మణ్య శబ్దానికి సుబ్బన్న వికృతి. సుబ్రహ్మణ్యేశ్వరుడు వేయిపడగల స్వామి. వేయి ముఖాలయిన ధర్మానికి చిహ్నం. వేయి ముఖాలుగా ధర్మం పరిపాలించబడ్డ ఈ దేధమే సుబ్బన్నపేటగా చెప్పబడింది. అంతేగానీ, ఇది ఒక ఊరు కాదు. ఇది ఒక జమీందారీ కాదు. ఈ సుబ్బన్నపేట మొదలుపెట్టడానికి ఒక ఆవూ ఒక పాము, ఆ ఆవు పాలు త్రాగుతూండటం మొదలైన కథ వుంది. ఇలాంటి కథలు ఈ దేశంలో అనేక చోట్ల వున్నై. కొంచెం మార్పులతో వుంటవి. అందుచేత దేశం యొక్క స్వరూపం చెప్పడం. ఏమిటయ్యా ఈ దేశం యొక్క స్వరూపం అంటే ఈ దేశం యొక్క సంస్కారం యొక్క పునాది అది. ఆధిదైవికము అన్న విషయము. అంతేగానీ, యిది నిజంగా పాము కాదు. పాము పడగలూ కాదు. ఒకానొక పండితుడు ఈ పుస్తకంలో పడగలూ లేవు, పామూ లేదు అన్నాడట. చమత్కారంగా అన్నాడు నిజమే. ఉన్నది ధర్మము, సంప్రదాయము. భారత జాతి యొక్క సంస్కారము. ఇందులో రంగాజమ్మ క్షత్రియ స్త్రీ. ఆమె రామేశ్వర శాస్త్రి యొక్క భార్య. మహా పతివ్రత. జీవితము ననుభవించు వైభవము నెరిగిన మనిషి. ఆమె వేద ధర్మము ననుష్ఠించుచూ లోకము ననుభవించిన క్షత్రియులకు చిహ్నం. ఆమె చనిపోవుచూ రామేశ్వర శాస్త్రినే భావించెను. ఈ దేశమునందు క్షత్రియులు అనగా రాజ్యము పాలించెడివారు. వారు కులము చేత క్షత్రియులు కానక్కర్లేదు.ఈ దేశం సంప్రదాయము వేద ధర్మమును పాలించుచూ, భావించుచూ పూర్వముండిరని దీని యర్థము. ఊరికే యొక పతివ్రత జీవిత కథ వలె కన్పించును. ఈ కావ్యము నందు ప్రధానంగా సహస్రముఖమైన వేద ధర్మము ప్రతిపాదింపబడెనని తెలిసికోవడం జరిగితే, ఈ గ్రంథంలో వున్న తక్కిన సర్వవిషయాలూ యిల్లా సువ్యక్తమౌతవి. ప్రధానంగా పసిరిక ఒకడు కనిపిస్తున్నాడు. ఇతడు మంగమ్మ బిడ్డ. చూస్తే పామల్లే వుంటాడు. ఈలలు వేస్తాడు. గాలిలో తేలిపోతాడు. రామేశ్వర శాస్త్రి చాతుర్వర్య్ణానికి చిహ్నం. అయితే… పసిరిక వ్యవసాయానికి చిహ్నం కదా.
అయితే, కావ్యంలో ఇలాంటి మనిషి వుంటాడాయని ప్రశ్న. కొందరు స్త్రీలకు పాములు కడుపున పుట్టినవి, యిద్దరు తలల పిల్లలు పుట్టారని యిలాంటి విషయాలు ఇంత అధునాతన నాగరికతా కాలంలో కూడా పత్రికలలో కనిపిస్తూనే వున్నవి. అందులో ఆశ్చర్యం లేదు కానీ, ప్రధానంగా పసిరిక కృషికి చిహ్నం. అది అచ్చమైన పంచభూతముల బహి: ప్రకృతి మీద ఆధారపడి వున్నది. వాన కురవాలి, గాలి వీచాలి, ఎండలు కాయాలి, పంటలు పండాలి, పామూలూ, పిట్టలూ యథేచ్ఛగా సంచరించాలి. ఇది వ్యవసాయం యొక్క స్వరూపం. ఇదంతా ఓక మనుష్యుని ఆకారంగా చేసి, వాణ్ణి పసిరిక అన్నాం. ఇంతే భేదము. ఈ వ్యవసాయము రెండు రకాలు. పండించే పొలం వాన ఆధారంతో పండితే దాన్ని మాతృకలంటారు. ఆనకట్టలు కట్టి కాల్వలు తవ్వి పండిస్తే వాటిని అదేవ మాతృకలంటారు. భారవి తన కిరాతార్జునీయంలో దుర్యోధనుడు అదేవ మాతృకల కింద పంటలు పండించి ప్రజలను తన వశం చేసుకొన్నాడని రాయబడింది. ఇతరుల రాజ్యం కాజేసిన రాజు ప్రజలను వశం చేసుకునేందుకు అదేవ మాతృకలను వృద్ధి చేస్తాడు. బాహుళ్యం మీద అదే చేస్తాడు. జనులందరూ వానికి వశులవుతారు.
ఈ శతాబ్దాలలో దేవుడన్న మాటకు మేఘుడని అర్థం. పల్లవుటూళ్ల పంటల వారు బోలెడంత విశ్రాంతి కలవాళు్ల. తేలికగా పండుతూ వుంటే బోలెడంత విశ్రాంతి వుంే ధర్మాన్ని పాడుచేస్తారు. మూడు వందల అరవై రోజులు పొలంలో పాటుపడవలసిన వాడు రాజకీయ, మత, సాంఘికాభిప్రాయముల మీదకు దండెత్తేందుకు వాడికి విశ్రాంతి యేది? అటువంటప్పుడు ధర్మం అజ్ఒానుల చేత పాలింపబడవలసి వస్తుంది. అందుకనే పసిరిక గ్రామాధికారిచేతిన వున్న గడియారం, ఫౌంటేను పెన్, చొక్కా మొదలైనవి పెట్టుకొని వెళ్లేటప్పటికి పాములు అతడ్ని కరిచినవి. ఈ రెండు నాగరకతలు అంత భిన్నములు. రెండూ రెండుగా రక్షింపబడితేనే ధర్మం రక్షింపబడుతుంది అని యర్థం. ఒక వృత్తిని మునుష్యుల యొక్క కామక్రోధాలు యెలా పాడుచేస్తాయో దేవదాసి చేత సూచితమైంది. అన్ని సిద్ధాంతాలు మొట్ట మొదట మంచివే. మనుష్యుల కామక్రోధాల చేత కాలము మీద వాటి లక్ష్యాలు చెడతవి. దానికి ప్రథమోదాహరణ దేవదాసి వృత్తి. ఈ అర్థాన్ని చెప్పేందుకు గిరిక సృష్టింపబడింది. ఎంత కొత్త సిద్ధాంతమైనా అంతే. ప్రజాస్వామికము మంచిదే. ఆచరణలో ఎంత దోషభూయిష్టంగా వున్నది. అలాగే హిందూ ధర్మమున్నూ, అనాదిలో సర్వజగత్తు యొక్క క్షేమంతో సంప్రతిష్ఠింపబడ్డ ధర్మం మానవునకు అధికార వాంఛ, స్వార్థము పుట్టుకతో వున్నవి. వాడు సర్వధర్మాన్ని నాశనం చేస్తాడు. స్వార్థపరుల చేత యీ రీతిగా నాశనం చేయబడ్డ ధర్మాన్ని మరికొందరు స్వార్థపరులు అసలా ధర్మం యొక్క మూలస్వరూపమే చెడ్డదియని చెప్పి, తమ స్వార్థానికి ఉపయోగపడే అధర్మాన్ని ధర్మంగా ప్రతిష్ఠిస్తారు. ఇది లోక వృత్తము. ఈ విషయం దేవదాసి కథలోని వ్యంగ్యం.
ఈ రీతిగా యీ కావ్యంలో వున్న బహు విషయాలు స్వజాతికి సంబంధించిన, భారతీయ సంస్కృతికి సంబంధించిన వేద ధర్మమునకు సంబంధించిన బహు విషయాల్లో వుండే గుణాలను చూపించి యెల్లా దుర్వ్యాఖ్యానం చేయబడ్డవో రాయబడ్డది. అందుకనే కావ్యం చివర ‘‘ఆహా… ఏమి కాలము… ఏమి మార్పు‘‘ అని 899 వ పేజీలో ప్రారంభింపబడి, రుక్మిణమ్మారావు గారు, కేశవరావు గారు, దేవదాసి, పసిరిక, గణాచారి అందరూ పోయినారని వ్రాయబడింది. వారెవ్వరెవ్వరు దేని దేనికి చిహ్నములో అక్కడే రాయబడివున్నది. ఆ చివరి రెండు పుటలు చదివితే వేయిపడగల అంతరార్థం తెలియును. ఈ రీతిగా సహస్రముఖ ధర్మము నాశనమైనదని ఆహా యింకనేమి మిగిలినది, యేమి మిగిలినది అన్న ఆవేదన చేత చెప్పబడి, చివరకు ధర్మారావు వరుంధతిని చూచి యిట్లన్నాడు. ‘‘ ఔను, నీవు మిగిలితివి. ఇది నా జాతిశక్తి – నా యదృష్టము’’ అని. అనగా ఈ దేశము నందు సర్వధర్మములు నశింవచ్చును కానీ, దాంపత్య ధర్మము, పాతివ్రత్యము ఎన్ని బిల్లులు పెట్టినా పోదని తాత్పర్యం. వట్టి లౌకికమైనది, వట్టి వికారమైనదియైన బుద్ధిగల ఒకాయన ఈ కావ్యము చదివి యన్నాడు గదా… ధర్మారావునకు రెండవ యరుంధతిని పెండ్లి చేయించుటను గూర్చి చివరకు సంకర వివాహము చేయించితివేమి యన్నాడు. కొందరి బుద్ధిలో అది పెండ్లికానిచో స్త్రీ పురుషుల మధ్య వయస్తారతమ్యము ప్రేమ కింద గొప్పచేయబడి, వివాహమన్నచో తప్పుగా పరిగణింపబడుచున్నది. ఇది ఆధునికుల నాగరికతా సంపత్తి. ధర్మం యొక్క స్వరూపము తెలియకపోయినచో, నీ కావ్య మర్మం అస్సలు అర్థం కాదు.
(నేడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి)