హిందువులు, బౌద్ధులు, సిక్కులపై పెరుగుతున్న ద్వేషం మాటేమిటి?
హిందూ, బౌద్ధ, సిక్కు మతాల పట్ల పెరుగుతున్న ద్వేషాన్ని, పక్షపాతాన్ని గుర్తించాలని ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి పిలుపునిచ్చారు. జనవరి 18న ఐక్యరాజ్యసమితికి చెందిన గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్ నిర్వహించిన ఇంటర్నేషనల్ కౌంటర్-టెర్రరిజం కాన్ఫరెన్స్-2022 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజం అనే మూడు అబ్రహామిక్ మతాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యతిరేకత ఫోబియా(వ్యతిరేకత)లను గ్లోబల్ టెర్రరిజం నిరోధక స్ట్రాటజీ గుర్తించినట్టుగా హిందువులు, బౌద్ధులు, సిక్కులపై మతపరమైన ఫోబియాను గుర్తించడం లేదని టిఎస్ తిరుమూర్తి ప్రధానంగా ప్రస్తా వించారు.
సమకాలీన మతపరమైన ఫోబియా ముఖ్యంగా హిందూ, బౌద్ధ, సిక్కు వ్యతిరేక భయాలు తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని. ఈ ముప్పును పరిష్కరించడానికి UN, ఇతర అన్ని సభ్య దేశాల దృష్టి సారించాలని అప్పుడే ఇలాంటి అంశాలపై మనం చర్చలతో మరింత సమతుల్యతను తీసుకు రాగలమని ఆయన ఉద్ఘాటించారు.
ఉగ్రవాద ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఉందని, దీనిపై ప్రపంచ దేశాల స్పందన అవసరమని ఆయన అన్నారు. అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ సరైన చర్యలు తీసుకోక పోతే అది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న ఉగ్రవాద శక్తులను ఉధృతం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్ళలో అనేక ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు వారి రాజకీయ, మతపరమైన ప్రేరణలతో తీవ్రవాదాన్ని జాతిపరంగా హింసాత్మక తీవ్రవాదం, హింసాత్మక జాతీయవాదం, మితవాద తీవ్రవాదం అంటూ రకరాల వర్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. UN చెందిన గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ ఆమోదించిన సూత్రాలకు ఇది విరుద్ధమని ఆయన అన్నారు.
సెప్టెంబరు 11 దాడుల అనంతరం ప్రకటించిన ‘‘తీవ్రవాదంపై యుద్ధం’’ డిక్లరేషన్‌పై నెలకొన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయంతో సాధించిన ప్రయోజనాలు ఇప్పుడు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద ప్రచారానికి ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి కమ్యూనికేషన్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం అధికమైంద న్నారు. క్యాడర్‌ను రాడికలైజేషన్ చేయడం, రిక్రూట్‌మెంట్ చేయడం, ఉగ్రవాదానికి నిధుల సేకరణ వంటి కార్యకలాపాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం చాలా ఎక్కువ జరుగుతోందని ఆయన అన్నారు.
తీవ్రవాదానికి ఇచ్చే నిర్వచనంలో కొత్త కొత్త పదాలు చేర్చడం పట్ల భారత ప్రభుత్వం అసౌకర్యంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని తీవ్రవాద నిరోధక కమిటీ (సిటిసి)కి ఈ ఏడాదికి భారత్ చైర్మన్‌గా వుందని భారత్ పదవిలో వున్నంత కాలం తీవ్రవాదంపై భద్రతా మండలిలో జరిగే చర్చల్లో ఇటువంటి పదాలను చేర్చడాన్ని భారత్ వ్యతిరేకి స్తూనే ఉంటుందని తిరుమూర్తి దీని ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారు.