కుట్టు మిషన్లు, పాఠశాలలు, అక్షరాస్యతతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విశేషమైన మార్పు తెచ్చిన మహిళ
దంతేవాడ లాంటి నక్సలైట్ల ప్రాబల్యం, పట్టు వున్న ప్రాంతాల్లో సేవ చేయడానికి కూడా ఆమె జంకలేదు. అత్యంత ప్రమాదకరమైన, వెనుకబడిన ప్రాంతం లాంటి అబూజ్ మడ్ లాంటి ప్రాంతాల్లో కూడా గత 40 సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ, అక్కడి ప్రజల్లో మంచి మార్పుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతాల వారందరూ ఆమెను ‘‘బడి దీదీ’’ అని ప్రేమగా పిలుచుకుంటారు. పేదరికం, నక్సల్ హింస వున్న ప్రాంతాలలో కూడి అమ్మాయిలను, మహిళలను, వృద్ధులను ఆదుకోవడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. నిజమైన విజయం ఆకర్షణలో లేదని, నిరంతర కృషి, వారసత్వాన్ని కాపాడటంలో వుందని బుధారి తాటి జీవితం చాటి చెబుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో బస్తర్, అంబూజ్ మఢ్ లాంటి నక్సలైట్ ప్రాబల్య ప్రాంతాల్లో విశేషంగా సామాజిక సేవ చేస్తున్న వనవాసీ మహిళ బుధారి తాటి అనే మహిళలకు పద్మశ్రీ అవార్డు లభించింది.
దంతేవాడలోని హిరనార్ గ్రామానికి చెందిన బుధ్రితాటి గత 40 సంవత్సరాలుగా బస్తర్ డివిజన్ లోని అటవీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో సమాజ సేవ చేస్తున్నారు. 1984 లో ఆమె తన సామాజిక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన జీవితాంతం బాలికల, మహిళల, వృద్ధుల సేవకే అంకితమయ్యారు. ఈమె సామాజిక సేవ ప్రారంభించక మునుపు దంతేవాడ విద్య, ఆరోగ్య, వనరుల్లో అత్యంత వెనుకబాటుగా వుండేది.
నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో బుధారి తాటి కుట్టు శిక్షణతో పాటు బాలికలకు విద్యను అందిస్తున్నారు. ఇలా దాదాపు 500 మందికి పైగా మహిళలు స్వావలంబన పొంది, సాధికారత దిశగా ముందుకు సాగుతున్నారు. క్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు దూరమైన పిల్లలలో విద్య గురించి అవగాహన కల్పించడానికి ఆమె కృషి చేస్తున్నారు. అలాగే వృద్ధాశ్రమాల్లో వుంటున్న వారికి కూడా సహాయం చేస్తోంది.

మరీ ముఖ్యంగా యువతీ, యువకులు తిరిగి నక్సలిజం వైపు ప్రభావితం కాకుండా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యపై విశేషంగా కృషి చేస్తున్నారు. పాఠశాలలను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా నక్సలైట్ల నీడ కారణంగా విద్యకు గానీ, సమాజానికి గానీ దూరమైన పిల్లలు, బుధ్రి తాటి కారణంగా పిల్లలు తరగతి గదులకు దగ్గరయ్యారు. ఆరోగ్య సౌకర్యాలు మెరుగయ్యాయి. విద్యకి స్థానికులు దగ్గరవుతున్నారు.
ప్రచారానికి దూరంగా వుంటూ, ప్రచారాన్ని ఏమాత్రం కోరుకోకుండా విద్య ద్వారా, కుట్టు మిషన్ల ద్వారా, పాఠశాలల వ్యాప్తి ద్వారా ఆమె చేస్తున్న కృషిని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కూడా గుర్తించి, ఆమె సత్కరించింది. బయటి వ్యక్తులే అడుగుపెట్టడానికే భయపడే అబూజ్ మఢ్ లాంటి ప్రాంతాల్లో బుధారి తాటి అక్కడి ప్రజల విశేష అభిమానాన్ని చూరగొన్నారు. ఒక కుట్టు మిషన్, ఒక పాఠశాల, వృద్ధులకు ఆసరా ద్వారా స్త్రీ ధైర్యం బయటపడింది. చీకట్లో ఓ దీపాన్ని ఎలా వెలిగించొచ్చో… బుధారి ఆచరణాత్మకంగా చేసి చూపిస్తున్నారు.
ఇవేకాకుండా వ్యసనాల నుంచి స్థానికులను విముక్తం చేయడంలో కూడా బుధారి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి కుటుంబాలందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ… చెడు అలవాట్లు, వ్యసనాల ద్వారా ఎంత నష్టమో జాగ్రత్తగా వివరిస్తూ, వారికి అవగాహన కల్పిస్తున్నారు.కుటుంబాలు మరియు సమాజం అవగాహన పొందకపోతే సాధ్యమే కాదని నమ్మేవారు. అలాగే తన సామాజిక సేవను మరింత విస్తరించడానికి నాగపూర్ లోని భారత రాష్ట్రీయ సంఘ్, వనవాసీ కల్యాణ్ ఆశ్రమంలో ఆరు నెలల పాటు శిక్షణ కూడా పొందారు.

తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై బుధారి తాటి హర్షం వ్యక్తం చేశారు. ఇది నా గిరిజన సమాజానికి గర్వకారణం, నా ప్రయత్నాల ద్వారా దాదాపు 545 మంది మహిళలు విద్యను పొందారు. ఇది నాకు దక్కిన గౌరవం కాదు. సమాజానికి దక్కింది. అబూజ్ మఢ్ మొదలు మారుమూల అటవీ ప్రాంతాల వరకూ నేను చేసిన సేవకి గుర్తింపు’’ అని పేర్కొన్నారు.