మావోయిస్టులకు భారీ దెబ్బ.. అగ్రనేత నంబాల కేశవరావు హతం.. మరో 28 మంది నగ్జలైట్లు కూడా
ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు పెద్ద విజయమే సాధించాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమయ్యాడు. ఈ స్థాయిలో వున్న మావోయిస్టు ఎన్ కౌంటర్ లో మరణించడం ఇదే తొలిసారి. నంబాల కేశవరావు హతమయ్యాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. అలాగే మరో 28 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు. ఈ 28 మందిలో నగ్జలైటు అధికారిక పత్రిక అవామ్ -ఇ- జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జ వెంకట నాగేశ్వర రావు (61), మావోయిస్టు కంపెనీ కాయ్ 7 కమాండర్ టిప్పు కూడా వున్నారు.
పక్కా సమాచారంతోనే…
నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని అబూజ్ మడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు సీనియర్లు కూడా వున్నారని సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాల నుంచి డీఆర్ జీ బలగాలు ఆ ప్రాంతంలోని అడవుల్ని జల్లెడపడుతూ ముందుకు సాగాయి. అప్పుడే మావోయిస్టులు కనిపించడంతో ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు, ఓ డీఆర్జీ జవాన్ మరణించారు. ఈ ప్రాంతంలో ఏకే 47, ఇన్సాస్, కార్బైన్ ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.జవాను మృత దేహంతో పాటు మావోయిస్టుల మృత దేహాలను కూడా నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
మావోయిస్టు ఉద్యమంలో కీలక వ్యక్తి… దాడుల్లో నిపుణుడు నంబాల కేశవరావు
మావోయిస్టు ఉద్యమంలో కేశవరావు కీలక వ్యక్తిగా పేర్కొంటుంటారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హిట్ లిస్టులో కూడా వున్నాడు. ప్రస్తుతం పరారీ జాబితాలో వున్నాడు .ఇతడి సమాచారం ఇస్తే 1.5 కోట్ల బహుమతి కూడా ప్రకటించింది.
నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామం. వరంగల్ NIT లో బీటెక్ పూర్తి చేశాడు. 1970 ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. 1980 నుంచి పీపుల్స్ వార్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2004 లో పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) కేంద్ర నాయకత్వ బాధ్యతల్లో వున్నాడు.
అయితే నక్సలైట్ ఉద్యమంలో గెరిల్లా యుద్ధ నైపుణ్యంలో అగ్రగణ్యునిగా చెబుతుంటారు. పేలుడు పదార్ధాల వినియోగం, ఐఈడీఎస్ వినియోగంలో నిపుణుడు. 1987 లో బస్తర్ అడవుల్లో ఈ శిక్షణంతా పొందాడు కేశవరావు. అందుకే అనేక దాడుల వెనుక నంబాల కేశవ రావు ప్రణాళికే వుందని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా అప్పట్లో అలిపిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో కేశవ రావే ప్రధాన పాత్రగా చెబుతారు. అలాగే 2010లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి వెనుక మాస్టర్ మైండ్ కేశవరావే అని సమాచారం. ఈ దాడిలో 72 జవాన్లు అసువులు బాసారు.