సేవాభాగ్యంలేని స్వర్గమెందుకు?
ముద్గలుడు సామాన్య కుటుంబీకుడు. చెమటోడ్చి జీవనం గడిపేవాడు. తన పొలంలో పండిన ధాన్యాన్నే అడిగినవారికి అడిగినంత దానంచేసి, పక్షులు, జంతువులు తిన్నంత తినగా మిగతావాటితో జీవనయాత్ర సాగించేవాడు. అతని త్యాగనిరతికి మెచ్చి అతన్ని బొందితో స్వర్గానికి తీసుకుపోవడానికి దేవతలు విమానం తీసుకువచ్చారు. ‘అక్కడ ఏమి ఉంటాయి?’ అని అడిగాడు ముద్గలుడు.
‘‘సర్వసుఖాలు ఉంటాయి’’ అన్నారు దేవతలు. ‘‘నేను అక్కడ చెయ్యడానికి ఏమైనా పని ఉంటుందా? ఆదరించడానికి, సేవించడానికి ఎవరైనా ఉంటారా?’’ మళ్ళీ అడిగాడు ముద్గలుడు. ‘‘అక్కడ నీవేమీ చేయాల్సిన అవసరంలేదు. అక్కడ దీనజనులంటూ ఎవరూ ఉండరు. కాబట్టి వాళ్ళకోసం పనిచేయాల్సిందేమీ లేదు. కేవలం భోగాలు అనుభవించడమే నీ పని’’ అన్నారు దేవతలు. ‘‘ఏ పని చేయకుండా స్వర్గంలో పొర్లాడటంకంటే ఈ కర్మభూమిలోనే కష్టపడి పనిచేసుకోవడమే నాకు ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. ఈ జీవితమే ఆనందాన్నిస్తుంది. మరొకరికి ఉపయోగంలేని జీవితం నాకు వద్దు’’ అని స్వర్గాన్నే తిరస్కరించాడు ముద్గలుడు.