తాజ్ మహల్ కానేకాదు..అది తేజోమహల్… అంటూ ఓ మహిళ కావడి యాత్ర
‘అది తాజ్ మహల్ కాదు.. తేజో మహల్.. మహాశివుని దేవాలం.. భోలేనాథుడు నాకు కలలో కనిపించి ఈ విషయాన్ని చెప్పాడు’ అంటూ ఒక మహిళ యూపీలోని ఆగ్రాలో గల తాజ్‌మహల్ దగ్గరకు చేరుకుంది . తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన జనం ఆ మహిళను చూసేందుకు గుమిగూడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను తాజ్ మహల్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది.
ఈ ఘటన సోమవారం ఉదయం తాజ్ మహల్ పశ్చిమ ద్వారం దగ్గర చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు మీనా రాథోడ్. ఆమె.. తాను హిందూ మహాసభ మహిళా మోర్చా ఆగ్రా జిల్లా అధ్యక్షురాలినని మీడియాకు తెలిపింది. ఆ మహిళ తన భుజాలపై కావడి పెట్టుకుని తాజ్‌మహల్ చేరుకుంది. ఆమెను గమనించిన పోలీసులు తాజ్‌లోనికి కావడి తీసుకువెళ్లకూడదంటూ అడ్డుకున్నారు.
అయితే ఆమె పోలీసులతో వాదనకు దిగింది. రెండు రోజుల క్రితం భోలేనాథుడు తనకు కలలో కనిపించాడని, తేజోమహల్ ఒక దేవాలయం అని, అక్కడ కావడి సమర్పించాలని తనకు చెప్పాడని ఆమె పోలీసులకు తెలిపింది. అమె తాజ్‌మహల్ లోనికి వెళ్లే విషయంలో మొండిగా వ్యవహరించడంతో పోలీసులు.. సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువస్తేనే అనుమతిస్తామని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె మరో మార్గంలేక కావడితో సహా ఇంటిదారి పట్టింది.