మహిళే హిందూ కుటుంబానికి ఆధారం – 3
మహిళా సాధికారత గురించి నేడు మనం తరచూ మాట్లాడుతుంటాం. రామాయణంలో తార వృత్తాంతం ఆమె రాజనీతికి, బుద్ధి కుశలతకు నిదర్శనం. సుషేణుడి కుమార్తెతో కిష్కింధకు రాజైన వాలి వివాహం జరిగింది. వాలి మహా బలశాలి. ఒకసారి మాయావి అనే రాక్షసుడిపైకి వాలి యుద్ధా నికి వెళ్ళాడు. కానీ అతను ఎంతకూ తిరిగిరాక పోవడంతో అందరూ వాలి మరణించాడని భావిం చారు. దాంతో వాలి స్థానంలో సుగ్రీవుడికి పట్టాభి షేకం జరిగింది. స్థానిక ఆచారం ప్రకారం తార సుగ్రీవుడి భార్య అయింది. కొన్నాళ్ళకు వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుణ్ణి తరిమివేసి మళ్ళీ రాజయ్యాడు. వాలి తిరిగిరావడంతో తార కూడా తన విధేయతను అతనికే ప్రకటించింది. సుగ్రీవుణ్ణి తరిమివేయడమే కాకుండా అతని భార్య రుమను చెరపట్టాడు. అన్నీ పోగొట్టుకున్న సుగ్రీవుడు ఋష్యమూకపర్వతంపై తలదాచుకున్నాడు. సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు ఋష్యమూకపర్వతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. సీతామాత జాడ తెలుసుకునేం దుకు సుగ్రీవుని సహాయం అందించాలని, వాలి వల్ల కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడంలో శ్రీరాముడు సహాయం చేయాలని ఒప్పందం కుదిరింది.
సుగ్రీవుడు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో సంయమనంతో వ్యవహరించాలని వాలికి సలహాచెపుతుంది తార. కోపాన్ని వదిలిపెట్టి సుగ్రీవుడితో కలిసి ఉండమని హితవు చెపుతుంది. గతంలో ప్రాణరక్షణ కోసం పారిపోయిన సుగ్రీవుడే మళ్ళీవచ్చి కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని చెపుతుంది. బలవంతుడైన మిత్రుడెవరో అతన్ని కాపుకాస్తూ సహాయపడటానికి వచ్చి ఉంటారని, కాబట్టి తొందరపడి యుద్ధానికి దిగవద్దని వారి స్తుంది. అయోధ్య రాకుమారులైన రామలక్ష్మణులతో చేసిన స్నేహం వల్ల సుగ్రీవునిలో విశ్వాసం నెలకొం దని గూఢచారి సమాచారం ద్వారా తెలుసుకున్న తార అదే విషయం వాలికి చెపుతుంది. నిజానికి ఆమె మాటలు ఎంతో సబబైనవి. అందులో నైతికతే కాక, సైనిక, రాజనీతి జ్ఞానం కూడా ఉంది. కానీ వాలి ఆమె మాట పట్టించుకోలేదు. కోపావేశాలు అతని బుద్ధిని మసకబార్చాయి. సుగ్రీవుడికి గుణ పాఠం చెపుతానని ప్రకటించాడు. దానితో తన మంత్ర తంత్ర జ్ఞానంతో వాలికి విజయం కలగాలని కొన్ని కర్మలు చేసి, ప్రార్థనలు చేసి వాలిని యుద్ధానికి పంపింది తార. వాలిసుగ్రీవుల మధ్య భీకరమైన పోరు సాగింది. ఇద్దరి పోలికలు ఒకేమాదిరిగా ఉండడంతో శ్రీరాముడు వాలిని గుర్తించి వధించ లేకపోతాడు. ప్రాణభయంతో పారిపోయివచ్చిన సుగ్రీవుడికి ధైర్యం చెప్పి, అతనిని గుర్తుపట్టడానికి వీలుగా మెడలో పూలమాల వేసి మళ్ళీ యుద్ధానికి పంపుతాడు. ఈసారి వాలిని గుర్తించి బాణంతో హతమార్చాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న వాలి అవసాన దశలో ఉన్నాడు. వాలి నేలకూలిన వార్త తెలియగానే అతని సైన్యం పారిపోసాగింది. సరిగ్గా అప్పుడే తార ఎంతో వివేకంతో, సందర్భోచితంగా ప్రవర్తి స్తుంది. వానర సైన్యాన్ని అదుపుచేసి వారిని తీసుకుని వాలి దగ్గరకు వస్తుంది. తార తెలివి తేటలు, సుగుణాలు తెలిసిన వాలి తన అంతిమ ఘడియల్లో సుగ్రీవుణ్ని పిలిచి ఆమె సలహాలు తీసుకోవాలని సూచిస్తాడు. నేర్పు, కుశాగ్రబుద్ధి పుష్క లంగా ఉన్న ధైర్యవంతురాలిగా తార మనకు కనిపిస్తుంది. ఆమె రాజనీతిజ్ఞురాలు, జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టగలిగిన బుద్ధి శాలి. కుమారుడైన అంగదుడి క్షేమ, ప్రయోజనాల కోసం అవతలివారికి తలొగ్గినట్లు కనిపిస్తుంది. ఆ విధంగా అతడిని సుగ్రీవుడికి దగ్గర చేస్తుంది.
– హనుమత్ ప్రసాద్