కాలికి బలపం కట్టుకున్నట్లే.. ఊరూరా తిరిగి.. 16 గ్రామాల రైతుల దిశను మార్చేసిన ‘‘పారేశమ్మ’’

అది అత్యంత కరువు నేల. భూములు పుష్కలమే కానీ.. నీరే లేనిది. అలాంటి ప్రాంతాల్లో కూడా వ్యవసాయమే దండగ అనుకున్న రైతులను మార్చి వారితో పంటలను సాగు చేయించి ఆ ప్రాంతాలను కరువు నుంచి తరిమికొట్టింది ఓ మహిళా రైతు. ఆమె పేరు పారేశమ్మ. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నివాసి. చదివింది కేవలం ఐటీఐ మాత్రమే. పారేశమ్మకి కేవలం రెండున్నర ఎకరాల పొలం మాత్రమే వుంది. కానీ సాగునీటి ఇబ్బందుల కారణంగా వ్యవసాయం చేయడమే కుదరలేదు. కానీ.. బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేయాల్సిందే కదా. భర్తది అతి చిన్న ఉద్యోగం. దీంతో ఏదైనా చేయాలని సంకల్పించింది.

కేవలం తన పొట్టే నిండితే స్వార్థమని… గ్రామంలో చాలా మంది పొట్టా నిండాలని కూడా పారేశమ్మ భావించింది. దీంతో ఆమెకు ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ అనే సంస్థ పరిచయమైంది. ఈ సంస్థ పర్యావరణం, నీటి సంరక్షణతో పాటు పూర్తిగా రైతుల కోసమే పనిచేస్తుంది. దీంతో పారేశమ్మ ఈ సంస్థలో చేరింది. నెలకు 4,500 రూపాయలు గౌరవ వేతనంతో తంబళ్లపల్లె పంచాయతీలో రిసోర్స్ పర్సన్ గా ఆ సంస్థ నియమించింది. ఇంకేముందీ… రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి పని ప్రారంభించింది. తంబళ్లపల్లె మాత్రమే కాదు.. దాని చుట్టూ వున్న ఏకంగా 16 పల్లెల్లో విధులు నిర్వర్తించాలి. అప్పటికే వ్యవసాయం చేస్తూ తలపండిన వారికి కూడా సలహాలివ్వాలి. పారేశమ్మనేమో.. అప్పుడప్పుడే వ్యవసాయంలోకి దిగింది.

పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో సంస్థ కృషి చేస్తోంది. ఆ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించడం ఈమె విధి. ఈ క్రమంలోనే తంబళ్లపల్లె మండలంలో గల 16 పంచాయతీలు కేటాయించారు. నూతన సాగు విధానాలు, రైతులకు తెలియజేసేవారు.చుక్క నీరు లేని ఆ భూములలో వ్యవసాయం చేయాలంటే రైతులు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఈమె ప్రోత్సాహం ప్రోద్బలం వల్ల రైతులను వ్యవసాయం వైపు మళ్ళించారు.

ఒక్కో గ్రామానికి దాదాపు పది పది సార్లు వెళ్లిన సందర్భాలూ కోకొల్లలు. ఉదయం నుంచి రాత్రి వరకూ పల్లెలు తిరుగుతూ రైతుల్లో చైతన్యం తీసుకొచ్చింది. వాస్తవంగా ఆ ప్రాంతంలో వున్న జలవనరుల పరిస్థితి, అతి తక్కువ నీటితో పండే పంటలపై చైతన్యం తీసుకురావడం, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల వల్ల కలిగే నష్టంతో పాటు పర్యావరణ స్పృహ, నూతన సాగు విధానాలను వివరిస్తూ వచ్చింది. ఇలా చెప్పగా … చెప్పగా.. అప్పుడు రైతులు కాస్త వినడం ప్రారంభించారు. పారేశమ్మ చెప్పేది నిజమే కదా అన్న ఆలోచన ధార వారిలో మొదలైంది. దీంతో మెళ్లిగా రైతులను పంటల సాగులో మార్పుకు ఒప్పించారు.

నీటి అవసరం అధికంగా ఉండే టమోటా వంటి పంటలకు బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వేరుశనగ పంట వంటి వాటిపై ఈమె రైతులకు అవగాహన కల్పించారు. దీంతో పంటకు నీటి అవసరం తగ్గినప్పటికీ పంట దిగుబడి బాగా పెరిగింది.అదేవిధంగా నీటి కుంటలు సహాయం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో ఈ ఐదు సంవత్సరాలలో 16 మండలాలలోని బీడు భూములు నేడు కూడా పచ్చని మాగాణాల వలే కలకలలాడుతున్నాయి. పారేశమ్మ చేసిన సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ‘‘ఉమెన్ వాటర్ ఛాంపియన్’’ అన్న అవార్డును ప్రదానం చేసింది.

మార్పులతో తృప్తిగా వుంది : పారేశమ్మ..

ప్రస్తుతం రైతుల్లో వచ్చిన మార్పులు, పొలాల్లో పచ్చదనం చూసి తృప్తిగా వుందని పారేశమ్మ పేర్కొంది. తంబళ్లపల్లె, పులసవాండ్లపల్లె, చెవిటివారి పల్లె, చెన్నప్పగారి పల్లె, నాయనప్పగారి పల్లె లాంటి మారుమూల గ్రామాల్లో అద్భుతమైన మార్పు వచ్చింది. ఈ 16 గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కర్ని సంఘంలో చేర్పించానని, వారితో నిత్యం సమావేశాలు నిర్వహించడం, భూగర్భజలాల స్థాయి ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడం ప్రారంభించానని తెలిపారు. ఏయే పంటలకు, ఎంత మేర నీరు అవసరం వుంటుందో కూడా కూలంకషంగా వివరించానని, దీని ద్వారా రైతులు తృప్తిగా వున్నారని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *