అంతరిక్షంలో మహిళాశక్తి
జాబిల్లి మీద అన్వేషణ చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవలే చంద్రయాన్ 3ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేర్చిన సంగతి మనందరికి తెలిసిందే… త్రీ ఇన్ వన్‌గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టును రూపొం దించడంలో మహిళా శాస్త్రవేత్తల కృషి కూడా ఉంది.
ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న రీతూ కరిథల్, ముత్తయ్య వనిత అత్యంత కీలక వ్యక్తులుగా పనిచేశారు. వారితో పాటుగా బాలు శ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కే. కల్పన, టెస్సీ థామస్, డాక్టర్ నేహ సటక లాంటి ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వామ్యం వహించి మహిళాశక్తిని నిరూపించారు.
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా
ఇస్రో టీమ్ అవార్డ్, ఏఎస్‌ఐ టీమ్ అవార్డ్, ‘సొసైటీ ఫర్ ఇండియా ఏరోస్పేస్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీస్’ నుంచి ఏరోస్పేస్ ఉమన్ అవార్డ్… ఇలా ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్న రీతూ.. లక్నోలో పుట్టి పెరిగి, అక్కడే బిఎస్సీ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత 1997లో ఇస్రోలో ఉద్యోగంలో చేరారు.. ఇస్రోలోని మిషన్ అనాలసిస్ డివిజన్‌లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె వివిధ ప్రాజెక్టుల్లో తన సామర్థ్యాన్ని నిరూపించు కున్నారు. 2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా ‘ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డును కూడా అందుకున్నారు. అంతేకాదు అంగారక గ్రహం మీద పరిశోధనల కోసం మన దేశం చేపట్టిన ‘మిషన్ మంగళ్‌యాన్’కు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ ప్రాజెక్ట్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. పలు సంస్థలు ఆమె కృషిని గుర్తించి సత్కరించాయి. ఆ తరువాత 2019లో ‘చంద్రయాన్-2’ మిషన్‌కు కూడా ఆమె డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు ‘చంద్రయాన్-3’కి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహ రించి… మరోసారి వార్తల్లో నిలిచారు. దాంతో ‘రాకెట్ ఉమన్ ఆఫ్ ఇండియా’గా ప్రశంసలు పొందు తున్నారు. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానంటున్నారు రీతూ.
తొలి మహిళా ప్రాజెక్ట్ డైరెక్టర్
దేశ ప్రతిష్టను పెంచే ప్రాజెక్టుల్లో పని చేయడం కన్నా సంతృప్తి మరేదీ ఉండదు’’ అని చెబుతోంది ఇస్రో సంస్థలో తొలి మహిళా ప్రాజెక్ట్ డైరక్టర్‌గా చరిత్రలో తనదైన స్థానం సంపాదించున్న మహిళ ముత్తయ్య వనిత. 2006లో అస్ట్రనామికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమన్ సైంటిస్ట్ అవార్డు, సత్య సాయి సేవా ట్రస్ట్ నుంచి ఈశ్వరమ్మ అవార్డుతో సహా పలు పురస్కారాలను అందుకున్న వనిత..రీతూ లాంటి ఎందరికో మార్గదర్శి. చెన్నైకి చెందిన ఈమె డిజైన్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇస్రోలో జూనియర్ ఇంజనీర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన వారు, వివిధ విభాగాల్లో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగారు. ‘కార్టోశాట్-1, ఓషన్‌శాట్-2’ తదితర అనేక ప్రాజెక్టుల్లో పని చేశారు. ఉపగ్రహాల తయారీలో మేటిగా గుర్తింపు పొందారు. డేటా నిర్వహణలో నైపుణ్యం, డిజిటల్, హార్డ్‌వేర్‌కు సంబంధించిన అంశాల్లో ఆమెది అందవేసిన చేయి. ‘చంద్రయాన్-1’కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన డాక్టర్ ఎం. అన్నాదురై ప్రోత్సాహంతో ‘‘చంద్రయాన్-2’ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వారు పనిచేశారు. వృత్తి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆమె తాజాగా ‘చంద్రయాన్-3’లోనూ కీలక పాత్ర పోషించారు.
– లతాకమలం