నిజాంనెదిరించిన మహిళా యోధులు

నిజాం ఏలుబడి అంతా హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలతో కొనసాగింది. గ్రామాలన్నీ తగలబెట్టి రజాకారులు తెలంగాణ పల్లెలను రావణ కాష్టంగా మార్చారు. నిజాం మూకలు, రజాకార్‌ల దౌర్జన్యాలతో తెలంగాణ పల్లెలు నిద్ర లేచేవి. ఎదురించిన గ్రామాల్లో నరమేధాన్ని సృష్టించి తిరుగుబాటును ఆదిలోనే అణచి వేయాలని కలలు కనేవారు. అత్యంత క్రూరంగా ప్రజలను హత్య చేసినప్పటికీ ప్రజలు వెనుకకు తగ్గకుండా తమ పోరాటం కొనసాగించారు.

 జీవితమే ఒక యుద్దం అన్న మాటకు నాటి ప్రజల జీవితమే తార్కాణం. తమదైనదేది తమది కాకుండా పోయి అన్నీ పరాయివాళ్ళ పాలుకావడం కన్నా దుర్మార్గం ఏముంటుంది. ఆ కాలంలో తెలంగాణ నైజాం నిరంకుశ పాలన, రజాకార్ల పాశవికత, బాంచన్‌ బతుకుల కన్నీటితో, నెత్తుటితో ఆ నేల తడిసిపోయింది. పుడితే శిస్తు, గిట్టితే శిస్తు, వెట్టి చాకిరి. చేతివృత్తుల దోపిడి, ఆడపిల్లల్ని చెర పట్టి దాసీలుగా మార్చి, శారీరకంగా వాడుకోవడం, అత్తవారింటికి వెళ్తున్న కూతుళ్లతో పాటు ఈ దాసీలను నజరానాగా పంపించడం-ఇలా రకరకాలుగా స్త్రీలను వేధించిన రోజులవి.  వీటిని ఎదుర్కొనేందుకు ఎందరో మహిళలు వీరోచిత పోరాటం చేశారు. పురుషులకు ఏమాత్రం తగ్గకుండా తమ ధైర్య, సాహసాలను ప్రదర్శించారు. సామాన్య మహిళలు అసమాన్య చరిత్ర సృష్టించారు.

పుట్నాల రామక్క

  ఎర్రగొల్లపాడుకు చెందిన పుట్నాల రామక్క తమ గ్రామం మీద దాడి చేసిన 12 మంది నిజాం పోలీసు దళాన్ని ఎదరించిన వీర వనిత. పోలీసుల తుపాకీ దెబ్బలకు పురుషులు వెనుకడుగు వేసినప్పటికి మొక్కవోని ధైర్యంతో పోరాడిరది. కుప్పలుగా ఉన్న రాళ్ళతో పోలీసులపై తీవ్రంగా దాడిచేసి గ్రామాన్ని సమీపించకుండా చేసింది రామక్క.  తూటాలు అయిపోయే వరకు కాల్పులు జరిపిన పోలీసులు కాలికి బుద్ది చెప్పారు. వారిని వెంటబడి తరుముతూ గ్రామ పొలిమేర్లను దాటించింది.

ఆరుట్ల కమలాదేవి

నల్గొండ జిల్లా మంతాపురి గ్రామానికి చెందిన రుక్మిణికి 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. ఆ సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడిరది. వివాహానంతరం హైదరాబాద్‌లో విద్యనభ్యసించడమే కాకుండా ఉద్యమాలలొ భర్తతో పాటు పాల్గొంది. నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో పాల్గొని అరెస్టై జైలుకు వెళ్ళింది. 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసింది. చల్లూరు గ్రామం గెరిల్లా దళాలకు ఆనాడు ఒక ముఖ్యకేంద్రం. చల్లూరు-వెంకటాపురం గుట్టలను చుట్టుముట్టి రిజర్వు పోలీసులు సాగించిన తుపాకీగుళ్ళ దెబ్బలకు ఎదురుకాల్పులు జరుపుతూ తమ దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా దంపతులు కమలాదేవి, రామచంద్రారెడ్డి శత్రు మూకలను అమెరికన్‌ రైఫిల్‌తో తిప్పికొట్టారు. ఇది నాటి పోరాట యోధుల స్మ ృతి పథంలో చెరగని ముద్రలు వేశాయి.

బి.సుమిత్రాదేవి

బి.సుమిత్రాదేవి హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ విమోచన ఉద్యమకారురాలు. 1947-48లో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని రజాకార్లపై పోరాడి జైలు కెళ్ళారు. 1948 సెప్టెంబరులో నిజాం సంస్థానం భారతదేశంలో విమోచనం వరకు ఆమె కంటికి నిద్రలేకుండా కృషిచేశారు. ఎల్లాప్రగడ సీతాకుమారి ప్రముఖ కథా రచయిత్రి, స్వాతంత్య్ర సమరయోధు రాలు. బాపట్లలో జన్మించారు. తన భర్త నారాయణరావుతో కలిసి 1926లో హైదరా బాదుకు తరలి వచ్చారు. అప్పటినుంచి ఆమె జీవితం ఇక్కడి తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేక మైంది. నిజాం నిరంకుశ పాలనలో ‘‘అక్కిరెడ్డిపల్లి’’ గ్రామంలో జరిగిన స్త్రీల అత్యాచారాలపై విచారణ జరిపే సంఘంలో సభ్యురాలైనారు. అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్త్రీలకు ధైర్యం చెప్పారు. నిజాం నిరంకుశ పాలనలో స్త్రీలపై జరిగిన అత్యాచారాలు, అన్యాయాలపై తీవ్రంగా పోరాటం చేశారు. బాధితులకు అండగా నిలబడ్డారు. సీతాదేవి. అనాధలకు, వితంతువులకు, భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు. ఇలా ఎందరో మహిళలు భర్తలు అజ్ఞాతంలో ఉంటే, గ్రామాల్లో ఉండి తమ పిల్లలను, వృద్దులను కాపాడుకునేందుకు నిత్యం యుద్దం చేశారు.

– డిఆర్‌ఎస్‌ నరేంద్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *