వంటా చేస్తాం.. రన్‌వే నిర్మిస్తాం…

మహిళలు కేవలం ఇంటికే పరిమతం కాదు వారు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. అంతటి ధైర్యం, తెగువ, ఆలోచనా శక్తి వారికి సొంతం. ఇంట్లో కత్తిపట్టి కూరగాయలు తరిగిన చేతులతోనే  కదనరంగంలో కత్తులు దూయగలదు. మన పురాణేతిహాసాల్లో, భారతీయ యుద్ధ చరిత్రలో ఇలాంటి వీరాంగనల గాథలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక మొన్న జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో ఇద్దరు మహిళల నేతృత్వంలో దిగ్విజయంగా సత్తా చూపించిన విషయం మనందరికీ తెలిసిందే… ఈ నేపథ్యంలోనే 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో ధ్వంసమైన భుజ్‌ వైమానిక దళ స్థావరాన్ని కొంతమంది మహిళలు గంటల వ్యవధిలో పునర్నిర్మించి.. పాక్‌ దాడులను తిప్పిగొట్టారు. ఈ సందర్భంగా వారి సహాయాన్ని మనం గుర్తుచేసుకోవడం తప్పనిసరి. మరి వారి గాథ గురించి తెలుసుకుందామా..!

1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో.. డిసెంబర్‌లో ఒక రాత్రి గుజరాత్‌లోని భుజ్‌ వైమానిక స్థావరంపై 14 ప్రాణాంతకమైన నాపామ్‌ బాంబులను జారవిడిచి కల్లోలం సృష్టించింది. ఆ బాంబులధాటికి భుజ్‌ రన్‌వే పూర్తిగా ధ్వంసమై పోయింది. దాంతో భారత్‌ యుద్ద విమానాలు ఎగరలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు యుద్ధ కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో వైమానికి దళాలకు ఏం చేయాలో పాలుపోలేదు. అదీగాక ఆ స్థావరంపై కేవలం రెండు వారాల్లోనే 35 సార్లకు పైగా బాంబు దాడులు జరిగాయి. మరోవైపు పాక్‌ శత్రు మూకలు ఆస్థావరాన్ని ఆక్రమించుకునేంత చేరువలో ఉన్నారు. పోనీ రన్‌ వే నిర్మిద్దామంటే అక్కడ ఉన్న సైన్యం, ఇంజనీర్లు కూడా తక్కువే…

ఆ సమయంలో భుజ్‌ ఎయిర్‌బేస్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న స్క్వాడ్రన్‌ లీడర్‌ విజయ్‌ కార్నిక్‌ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది ఫలిస్తుందా లేదా తెలియదు. కానీ అంతకుమించిన దారి లేదు. ఆయన దగ్గరలోని మాదాపూర్‌ గ్రామంలోని మహిళల సాయం తీసుకున్నారు. మొత్తం 300 మంది మహిళలు ఆయనకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో తల్లులు, కుమార్తెలు, వితంతువులు కూడా ఉన్నారు.

 వారంతా శత్రు విమానాలకు కనపడకుండా ఆకుపచ్చ చీరలు ధరించి రన్‌వే నిర్మాణానికి పూనుకున్నారు. బరువైన రాళ్లను, సిమెంట్‌ బకెట్లను మోసుకెళ్లారు. చేతులతో మెర్టార్‌ కలిపారు. తమ ఇంటిని నిర్మించినంత శ్రద్ధతో రన్‌వేని తిరిగి నిర్మించారు. అయితే వైమానిక దాడి సైరన్లు మోగినప్పుడల్లా పొదల్లోకి వెళ్లి దాక్కునేవాళ్లు. మరి ఆకుపచ్చని చీరలే ఎందుకంటారా  అవి చెట్లలో కలిసిపోవడానికి ఉపయోగ పడతాయని.. ఆ మహిళలంతా అహర్నిశలు కష్టపడ్డారు. పగుళ్లు మూపివేసేందుకు ఆవుపేడ ఉపయోగించారు. అలా వారంతా కేవలం 72 గంటల్లోనే రన్‌వేని తిరిగి నిర్మించారు. దాంతో గగనంలో కూడా యుద్ధం చేయగల శక్తిని భారత్‌ అందుకోగలిగింది.

అయే వత్సలే మంగలే హిందూభూమే

స్వయం జీవితాన్యర్పయామస్త్వయి

మాతృభూమికోసం సర్వస్వాన్ని అర్పణ చేయడానికి సిద్ధం అని దీని భావం. నిజానికి ఆ మహిళలకు  ఆ నిర్మాణ పనిలో శిక్షణ లేదు, అలాగే యుద్ధ అనుభం, రక్షణాయుధాలు కూడా లేకుండా అజేయమైన ధైర్యమైన సాహసాలతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశసేవలో పాలుపంచుకోవ డానికి ముందుకొచ్చిన వీర వనితలు వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *