ప్రపంచ బ్యాంకు దృష్టిని విశేషంగా ఆకర్షించిన ‘‘యూపీ వ్యవసాయ విధానాలు’’
ఉత్తర ప్రదేశ్ రైతులకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. వ్యవసాయాన్ని సాంకేతికతతో అనుసంధానించే ప్రక్రియ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ కృషి ఏకంగా ప్రపంచ బ్యాంకునే కదిలించింది. వ్యవసాయాన్ని సాంకేతికతతో జోడించడాన్ని యూపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రశంసించారు. ‘‘దృఢమైన, స్థిరమైన వ్యవసాయ నమూనా’’ అంటూ అభివర్ణించారు కూడా.
2025 ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా అగ్రికనెక్ట్ ఫ్లాగ్ షిప్ కార్యక్రమంలో బంగా మాట్లాడారు. తాను స్వయంగా యూపీని సందర్శించానని, దీని తర్వాతే ఈ విషయాలన్ని ఆకళింపు చేసుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత అజయ్ బంగా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లోనూ దీనిని పోస్ట్ చేశారు.
అలాగే యూపీ ప్రభుత్వం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. తమ ప్రభుత్వం చేస్తున్న స్థిరమైన, దృఢమైన వ్యవసాయ విధానాలతో పాటు పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను కూడా అభివృద్ధి చేస్తున్నామని దీనిని ప్రపంచ బ్యాంకు గమనించి, రైతులను, రైతుపద్ధతులను ప్రశంసించిందని సీఎం యోగి ప్రకటించారు.
అయితే.. యూపీ ప్రభుత్వం ‘‘పర్యావరణంలో వస్తున్న వాతావరణ సవాళ్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఈ విధానం కూడా ప్రపంచ బ్యాంకును ఆకర్షించింది. వేడిని తట్టుకునే విత్తనాలు, నేలకు సరిపడే విధంగా ఎరువులు, పునరుత్పత్తి పద్ధతులు, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థ, రైతు బీమా పద్ధతులు, ఫైనాన్సింగ్ వ్యవస్థ యూపీలో సమర్థవంతంగా నడుస్తోంది. దీంతో రైతులు విశేషంగా లాభాలు పొందుతున్నారు. అలాగే వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు.
పంటకి సోకే వ్యాధులను నిర్ధారించుకోవడానికి రైతులు AI పద్ధతులు, మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎరువుల వాడకంలో మార్గనిర్దేశనం, వాతావరణ హెచ్చరికలు జారీ చేయడానికి డిజిటల్ పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు రైతులు.అలాగే డిజిటల్ చెల్లింపులే అక్కడి రైతులు చేస్తున్నారు.
అయితే.. ఈ విజయం అంతా కూడా పూర్తి సమన్వయంతోనే సాధ్యమైంది. ప్రభుత్వాలు, వ్యాపార, అభివృద్ధి, రైతుల మధ్య సమన్వయంతోనే సాధ్యమవుతూ వస్తోంది. అలాగే యూపీలో వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రపంచ బ్యాంకు, యూపీ ప్రభుత్వం సంయుక్తంగా ‘UP AGREES’ (UP Agriculture Growth and Rural Enterprise) అనే ప్రాజెక్టును కూడా ప్రారంభించాయి. ఈ చొరవతో దాదాపు 10 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తొంది. వాతావరణ మార్పులు, విత్తనాలు, మార్కెట్లు, బీమా సమాచారాన్ని అందించడానికి యూపీ ప్రభుత్వం ఓ డిజిటల్ వ్యవసాయ వ్యవస్థను కూడా రూపొందించింది. దీంతో ‘‘స్మార్ట్ వ్యవసాయ పరివర్తన’’ కి యూపీ ఓ నమూనా అని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. యూపీ ప్రభుత్వం రైతుల కోసం అనుసరిస్తున్న పద్ధతులు యావత్ ప్రపంచం అనుసరించాలని కూడా ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా పిలుపునివ్వడం విశేషం.