పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా బాకులో ‘‘కాప్ 29’’ సమావేశాలు
అజర్ బైజాన్ రాజధాని బాకులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు కాప్ 29 నేడు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో ఈ సదస్సు ఉపయోగపడుతుంది. వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ నేతలు చర్చిస్తారు. అయితే.. భారత్ పక్షాన ప్రధాని మోదీ వెళ్లడం లేదు. ఆయన తరపున కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని 19 మంది బృందం వెళ్లింది. పర్యావరణ విషయంలో భారత్ చేస్తున్న కృషి, పాత్రపై వీరు ప్రసంగిస్తారు. పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం భారీగా నిధులను సమకూర్చేలా అభివృద్ధి చెందిన దేశాలపై ఈ సమావేశం బాధ్యత మోపనుంది. కేవలం హామీలకే పరిమితం కావొద్దని, ఆచరణ వైపు అడుగులు పడాలన్నది భారత్ ఆకాంక్ష అని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నెల 22 వరకూ ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సంవత్సరం అజర్‌బైజాన్‌లో జరగబోతున్న ఈ సమావేశంలో గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు సహకరిస్తున్న పేద దేశాలకు ఆర్థిక సాయం ఎలా అందించాలన్నదే ప్రధానాంశం.
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న అతి పెద్ద సదస్సు COP29. ఈ సంవత్సరం ఈ ఈవెంట్ నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరుగుతుంది.రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఉండే మధ్య ఉండే ఆసియా దేశం అజర్‌బైజాన్. ఆ దేశ రాజధాని బాకు నగరం ఈ సదస్సుకు వేదిక. ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ అనే మాటకు సంక్షిప్త రూపమే కాప్ (COP). ఈ యేడాది జరగబోతున్నది 29వ సదస్సు కావడంతో దీనిని కాప్29 అని అంటున్నారు. ఈ సమావేశానికి సర్వసాధారణంగా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరవుతారు.
ఈ సంవత్సరం ప్రధానమైన చర్చనీయాంశం ఆర్థిక సాయం. 2015లో జరిగిన పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5C కంటే ఎక్కువ పెరగకుండా నిరోధించడానికి ప్రపంచ నాయకులు కట్టుబడి ఉండాలి. దీనికి కట్టుబడి ఉండటమంటే అన్ని దేశాల అధినేతలు తమ దేశాలలో విడుదలయ్యే కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలి. ఈ ఒప్పందంలో భాగంగా, 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం నగదు సహాయం లక్ష్యాలను కొత్తగా నిర్దేశించుకోవాలి. ఈ నగదు సహాయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తాయి.
భారత్ అడిగేది ఇదే ?
ఆర్థిక పురోగతి, వాతావరణ మార్పుకు మధ్య సమతుల్యత సాధించడమే ఇందులో చర్చిస్తారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, పెట్రోయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి వాటిపై భారత్ ప్రధానంగా అడగనుంది. వాతావరణ మార్పులకు సంబంధించి అన్ని దేశాలనూ సమంగా చూడాలన్నదే భారత్ డిమండ్. అలాగే ధనిక దేశాలు ఇప్పటి వరకు వెదజల్లిన కర్బన ఉద్గారాల వల్ల కలిగిన నష్టాన్ని ఆ దేశాలే భర్తీ చేయాలని కూడా అడగనుంది. అలాగే ఈ ధనిక దేశాలు పర్యావరన అనుకూల సాంకేతికత, నిధులను రాజ్యాలకు అందించాలని కూడా కోరుతోంది.