50 ఏళ్ల కిందటి పద్ధతితో సక్సెస్ అయిన రైతు.. వరి నాటి… ఆనందమే ఆనందం

ఒక్క ఐడియా అనేది జీవితాన్ని మార్చేస్తుంది అన్న డైలాగ్ బాగా వ్యాప్తమైంది. నిజమే.. ఇది అన్ని రంగాలకూ పనికొస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఓ యువ రైతు చాలా లాభపడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పర్సాయపల్లి స్టేజీ అన్న గ్రామంలో ఓ యువ రైతు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. అయితే వాళ్ల వ్యవసాయ క్షేత్రంలో సరిపడా నీళ్లు లేవు.దీంతో సహజంగానే బోర్ వేయిద్దామని భావించాడు. కానీ.. ప్రయత్నమైతే చేశాడు కానీ.. 12 ఫీట్ల లోతు నుంచే బండ వుండటంతో బోరు వేసినా ఫలిత శూన్యం. ప్రయోజనమే దక్కలేదు. దీంతో కాస్త ఆలోచించి, తన వ్యవసాయ క్షేత్రానికి పక్కనే వుండే ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చిన నీటితోనే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. అయితే.. తన పంటకు సరిపడా నీరు రాకపోవడంతో పంట ఎండిపోయింది. ఈ సారి అయితే ఎస్సారెస్పీకి గోదావరి జలాలు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పునరావృత్తమయ్యాయి. దీంతో ఆ యువ రైతు దిగాలు చెందాడు. కానీ.. పెద్దవారందర్నీ సంప్రదించి, 50 ఏళ్ల క్రితం నాటి ఓ సలహానిచ్చారు. అదే ‘‘చెలిమ గుంతల పద్ధతి’’.

50 సంవత్సరాల క్రితం అంతగా డబ్బులు లేని రైతులు ‘‘చెలిమ గుంతలు’’ తవ్వేవారు. దాంట్లో ఊరిన ఊట వాళ్ల పంటలకు సరిపోయేది. ఇలా గుంతల ద్వారా ఊరిన నీటిని బిందెలతో తీసుకొచ్చి, మొక్కలకు పోసి, పండించేవారు. పెద్దవారు చెప్పిన ఈ టెక్నిక్ ను పొల్లుపోకుండా అంకిరెడ్డి సుధాకర్ అమలు చేశాడు. వెంటనే పొలంలో చెలిమ బావి తవ్వించాడు. ప్రొక్లెయినర్ తో సుమారు 14 ఫీట్ల లోతు తవ్వడంతో ఆరు ఫీట్ల లోతు రాగానే జలం ఊరింది. దీంతో ఆ యువ రైతు తెగ సంబురపడ్డాడు. వెంటనే విద్యుత్తు మోటారు బిగించి, తన ఎకరన్నర పొలంలో వరి నాటాడు.

దీనిపై ఆ యువరైతు స్పందించాడు. తనకు చాలా ఆనందంగా వుందన్నాడు. ఇలా చేయడానికి తనకు కేవలం 6 వేలు మాత్రమే ఖర్చయ్యాయని, ఇంత ఖర్చులోనే నీళ్లొచ్చాయన్నారు. బావిలోలాగే జల కళ కనిపిస్తోందని, పంట కూడా బాగానే దిగుబడి వస్తోందన్నారు. పంటకు సరిపోయేటంత నీరు వస్తోందని, చాలా ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *