కుంభమేళా ఓ కుటుంబానికి 30 కోట్ల ఆదాయం తెచ్చింది : సీఎం యోగి వెల్లడి
ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా మహా కుంభమేళా ఉత్సవం జరిగింది. శివరాత్రికి అది ముగిసింది. అయితే..దీనిపై లౌకికవాదులు, హిందూ వ్యతిరేకులు తీవ్ర విమర్శలకే దిగారు. అయితే.. వీటిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ గట్టిగా బదులిచ్చారు. కుంభమేళాతో ఆర్థికంగా ఎంతో లాభపడ్డారని ప్రకటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఓ ఆసక్తికర ఘటనను వెల్లడించారు.
కుంభమేళా సందర్భంగా ఓ కుటుంబం 130 పడవలు నడిపి, ఏకంగా దాదాపు 30 కోట్లు ఆర్జించారని ప్రకటించారు. పడవలు నడిపే వారు దోపిడీకి గురయ్యారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సందర్భంగా సీఎం యోగి ఈ కుటుంబాన్ని ఉదహరించారు.
‘‘పడవ నడిపే ఓ వ్యక్తి విజయ గాథను నేను పంచుకోవాలని అనుకుంటున్నా. అతడి కుటుంబానికి 130 పడవలున్నాయి. కుంభమేళా సమయంలో ఒక్కో పడవతో రోజుకు 50 వేల నుంచి 52 వేలు సంపాదించారు. అంటే 45 రోజులకు ఒక్కో పడవతో దాదాపు 23 లక్షల చొప్పున ఆదాయం సమకూరింది.అలా మొత్తంగా 130 పడవలతో 30 కోట్లు ఆర్జించారు’ అని సీఎం యోగి ప్రకటించారు.