వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో ‘‘యువ చైతన్య శిబిరం’’

వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో రెండు రోజుల పాటు ‘‘యువ చైతన్య శిబిరం’’ జరిగింది. ఈ యువ చైతన్య శిబిరంలో మూడు జిల్లాల నుంచి, 49 గ్రామాల నుంచి యువతీ, యువకులు హాజరయ్యారు. మొత్తం 67 మంది యువతీ యువకులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.

ఈ శిబిరంలో వనవాసీ కల్యాణ పరిషత్ స్థాపన, చేస్తున్న కార్యక్రమాలపై అవగాహనతో పాటు యువ కార్యం ఎందుకు చేయాలి? హాస్టళ్లు, కళాశాలలో యువకుల పని, సోషల్ మీడియాలో వనవాసుల కథన నిర్మాణం, పంచపరివర్తన, యువకుల జీవితంలో దీని వికాసం, వనవాసుల పరంపర చరిత్రతో పాటు మరికొన్ని అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే శిబిరంలో భాగంగా ‘‘మాతృ హస్తభోజనం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది కార్యకర్తలు తమ ఇంట్లోనే భోజనం తయారు చేసి, కుటుంబ సమేతంగా శిబిరానికి వచ్చి, శిక్షార్తులతో కలిసి భోజనం చేశారు.

యువ చైతన్య శిబిరం ఉద్ఘాటనా కార్యక్రమంలో వనవాసీ కల్యాణాశ్రమం దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి తాడేపల్లి శివరామకృష్ణ, ప్రాంత అధికారి వేంకటేశ్వర రావు దేశపాండే తో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేంకటేశ్వర రావు దేశపాండే మాట్లాడుతూ వనవాసీ కల్యాణాశ్రమ స్థాపన, నేపథ్యాన్ని వివరించారు. దేశంలో యువకులు ఎక్కువ సంఖ్యలో వున్నారని, వారందరూ దేశం కోసం పనిచేయాలని, వనవాసీ కల్యాణ పరిషత్ కార్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశానికి శక్తి యువకులే అని అన్నారు. యువకులు తమ విద్యాబోధనతో పాటు సమాజ కార్యంలో కూడా పాలు పంచుకోవాలని, సమాజ వికాసం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి తాడేపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ మాతృహస్త భోజనం ఆవశ్యకతను వివరించారు. అలాగే పంచపరివర్తన విషయాలను కూడా వివరించారు. దీనితో పాటు వనవాసీ కల్యాణాశ్రమం స్థాపన, చరిత్రను కూడా వివరించారు. మనమంతా భారతవాసులమని వివరించారు. యువకులందరూ కల్యాణాశ్రమం కార్యంలో పాల్గొనాలని, ఆదిలాబాద్ జిల్లాలో వనవాసీ కల్యాణ పరిషత్ కార్యాన్ని విస్తరించాలని, అందరూ పనిలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *