వినాయక చవితి: సమరసతకు రూపం – పర్యావరణానికి దీపం
హిందూ సాంప్రదాయంలో వినాయక చవితి అత్యంత ఉత్సాహంగా జరుపుకునే విశిష్టమైన పండుగ. ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి నాడు ఈ పండుగ వస్తుంది. విఘ్నాలను తొలగించి, ఆయురారోగ్యాలు, విజయాలను ప్రసాదించే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన శ్రీ విఘ్నేశ్వరుడిని తొమ్మిదిరోజుల పాటు ప్రజలందరూ మహా వైభవంగా నిర్వహిస్తారు. అనంత చతుర్థశినాడు వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తారు. ఈ వినాయకుడి పూజకోసం ఉపయోగించే ప్రతిమ నుంచి అన్నీ వస్తువులు కూడా ప్రక్రుతి సిద్ధంగానే ఉంటాయి.
ఈ పండుగ ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు గొప్ప సామాజిక ఐక్యతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కుల,, వర్గ భేదాలను పక్కనబెట్టి ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే. వీధి వీధినా మండపాలు ఏర్పాటు చేసి అందరూ కలసిమెలసి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో అద్భుతమైన సోదరభావం పెంపొందుతుంది.
మరోవైపు ప్రకృతి ఆరాధనే ఈ ఉత్సవానికి అసలైన ఆత్మ వంటిది. పూర్వం చెరువుల మట్టితో విగ్రహాలు చేసి, వివిధ రకాల మూలికా గుణాలున్న పత్రితో పూజించి నీటిలో విసర్జించేవారు. నేడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగుల వల్ల పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతోంది. మనమందరం మట్టి గణపతులనే పూజించడం, ప్లాస్టిక్ రహిత అలంకరణలు చేపట్టడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకోవాలి. సమాజాన్ని ఏకం చేసే సమరసతను,ధర్మ పరిరక్షణను కలిగిస్తూ, ప్రకృతిని పరిరక్షించే పర్యావరణ స్పృహను జోడించి, పండుగ జరుపుకోవడమే మనం వినాయకునికి అందించే నిజమైన పూజ.