ఆ ఊరిని మార్చేసింది ‘‘లైబ్రరీ’’
‘‘విద్యయాఅమృత మశ్నుతే’’ ఈశావాస్యోపనిషత్తులోనిది. విద్య ద్వారానే అమృతత్వాన్ని లేదా మోక్షాన్ని పొందుతామని దీని అర్థం. కొన్ని కొన్ని గ్రామాలను వ్యక్తులను మార్చుతుంటారు, మరి కొన్ని గ్రామాలు వాటంతటవే మారుతుంటాయి. అక్కడ ప్రజల చైతన్యం అలా వుంటుంది. కానీ.. కేరళలోని మానంతవాడిలోని తెట్టమాల అనే చిన్న గ్రామానిది మాత్రం విచిత్రమైన పరిస్థితి. అక్కడి ప్రజలను మార్చింది ‘‘ఓ లైబ్రరీ’’. నిజమే మీరు విన్నది.
తెట్టమాల అనే గ్రామం పూర్తిగా కొండల్లో వుంటుంది. అక్కడి ప్రజలకు జీవనోపాధి కేవలం తేయాకు తోటలు మాత్రమే. చాలా మంది అక్కడి యువకులు ఇతర విషయాలు కూడా ఆలోచించరు. కేవలం తేయాకు తోటలపైనే ఆధారపడుతుంటారు. కానీ.. ప్రస్తుతం ఆ గ్రామ కథే మారిపోయింది. ఇప్పుడు ఆ గ్రామానికి రహదారులు వచ్చాయి, ఆస్పత్రులు, పాఠశాలలు, ఇంజినీరింగ్ విద్యా సంస్థలు కూడా వచ్చేస్తున్నాయి.
ఈ నిశ్శబ్ద పరివర్తనకు కేంద్రబిందువు ‘సంఘచేతన లైబ్రరీ’. దీనిని 2006లో స్థానిక యువకుల బృందం ఒకటి స్థాపించింది. దీనికి పెద్ద భవనం గానీ, సమృద్ధిగా వనరులు గానీ లేవు. కానీ, అక్కడ ఉన్న యువకులు కలిసి కూర్చుని చదువుకుంటారు. ఉద్యోగం అసాధ్యమన్నది గతంలో భావించేవారు. కానీ.. ఇప్పుడు వారంతట వారే ఒకరికొకరు చైతన్యపరుచుకొని, ఉద్యోగాల వైపు కూడా వెళ్తున్నారు.
PSC పరీక్షల కోసం సిద్ధమవ్వడానికి అక్కడ చేరిన మొదటి బృందం ఒక కీలక మలుపుగా మారింది. వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కూడా తాము లైబ్రరీలో కూర్చొన్న గదికే వస్తారు. సాయంత్రం వేళల్లో అక్కడి యువకులకి పాఠాలు చెబుతారు. ప్రతి సారీ ఈ సైకిల్ ఇలాగే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ గ్రామంలో 75 మంది ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు. వారంతా అక్కడి యువకులకు అదే లైబ్రరీ వేదికగా పాఠాలు చెబుతున్నారు.
“అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఎప్పుడూ ఉండేది, కానీ మాకు సరైన దిశానిర్దేశం లేదు. చాలా కాలం పాటు మా జీవితాలు తేయాకు తోటల చుట్టూనే తిరిగాయి. ఆ వాస్తవాన్ని మార్చాలని సమాజం కోరుకోవడంతోనే ఈ గ్రంథాలయం ఏర్పడింది. మా పిల్లలు విశాల ప్రపంచాన్ని చూడాలని, దాన్ని చేరుకోవడానికి అవసరమైన వనరులను పొందాలని మేము కోరుకున్నాము,” అని స్థానిక యువకుడు చెబుతున్నాడు.
“ఇక్కడ మొదటి బృందం పీఎస్సీ (PSC) పరీక్షలకు సిద్ధమవ్వడం ప్రారంభించినప్పుడు, వారిలో దాదాపు అందరూ చివరికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారికి అసాధారణమైన విద్యా నేపథ్యం లేకపోయి ఉండవచ్చు, కానీ దృఢమైన ప్రయత్నం తమను ఎంతో ముందుకు తీసుకెళ్లగలదనే నమ్మకం వారిలో ఉండేది” అని లైబ్రరీ కార్యదర్శి సురేష్ చెబుతున్నారు.
చివరికి, ఆ గ్రంథాలయం సామాజిక కార్యక్రమాలకు ఒక సమావేశ కేంద్రంగా మారింది. స్థానిక యువత అక్కడ స్వయం సహాయక బృందాలు, ఉపశమన సంరక్షణ కార్యకలాపాలు, మహిళలు మరియు వృద్ధుల కోసం వేదికలు, ఇంకా ఫుట్బాల్ శిక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టారు.ఈ గ్రంథాలయం సాధించిన విజయానికి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది: ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులతో కూడిన ఒక తరాన్ని తయారు చేయడంలో తోడ్పడింది ఈ లైబ్రరీ.