వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లతో ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్న మహిళా రైతులు
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు మహిళల, మహిళా రైతుల జీవితాలను ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాయి. నాబార్డు, సావిత్రీ బాయి పూలే సంస్థ చొరవతో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న కర్మద్ సహా వివిధ గ్రామాలకు చెందిన 3,500 మందికిపైగా మహిళా వ్యవసాయ కూలీల జీవితాలు మారిపోయాయి. వారు ఇప్పుడు నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు లభించని రైతులకు వివిధ రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది. ప్రత్యేకించి కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమలోనూ రైతులకు చేదోడును అందిస్తోంది. గత నాలుగేళ్లలో నాబార్డ్, సావిత్రీ బాయి పూలే సంస్థ సంయుక్తంగా చేసిన కృషితో వ్యవసాయ నేపథ్యం కలిగిన వేలాది మంది మహిళలు ఆర్థిక వికాసాన్ని సాధించారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలో ‘వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్’ కంపెనీ ఏర్పాటుతో ఇది సాధ్యమైంది. ఈ కంపెనీ ఏర్పాటుచేసిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతో మంది గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నాయి.
మహిళా రైతులను, ఉత్సాహం వున్న మహిళలను నాబార్డు ఒక్కచోట చేర్చింది. దీంతో ‘‘వీ ఫర్ ఉమెన్ ఎంపవర్ మెంట్’’ సంస్థను ఏర్పాటు చేయించింది. ఇందులోని డైరెక్టర్ల బోర్డులో అందరూ మహిళలే. వారే నిర్వహిస్తున్నారు. బ్యాంకు రుణాలను అందజేయడంలో మాత్రం నాబార్డు వీరికి పూర్తిగా సహకరిస్తుంది.ఇవన్నీ చేయడానికి ఆయా వ్యవసాయ రంగ ప్రాసెసింగ్ పరిశ్రమలతో వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది.”గత నాలుగేళ్లలో 300 విభిన్న ప్రాజెక్టుల ద్వారా మూడున్నర వేల మందికిపైగా మహిళలకు ఆర్థిక సాధికారతను అందించడంలో వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ విజయం సాధించింది” అని నిర్వాహకులు తెలిపారు.

వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.74 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ కంపెనీని ఏర్పాటు చేసిన మొదటి ఏడాదిలో రూ.35 కోట్ల టర్నోవర్ వచ్చింది. మూడో ఏడాదికల్లా రూ.74 కోట్ల టర్నోవర్ వచ్చింది.మొక్కజొన్న ప్రాసెసింగ్ పరిశ్రమ, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమల నుంచే ఈ కంపెనీకి భారీ ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న పెద్దపెద్ద కంపెనీలకు ఈ కంపెనీయే ప్రాసెస్ చేసిన మొక్కజొన్నను సరఫరా చేస్తోంది. రోజుకు సగటున 3 టన్నుల మొక్క జొన్నను ప్రాసెస్ చేస్తారు. మొక్కజొన్నను ప్రాసెసింగ్ చేస్తే 6 రకాల భాగాలు లభిస్తాయి. వీటిలో ఒక ముఖ్యమైన పదార్థాన్ని కుర్కురే వంటి ఫుడ్ ఐటమ్స్ తయారీలో ఉపయోగిస్తారు.
ఇక మరో పని కూడా చేస్తోంది ఈ సంస్థ. గిట్టుబాటు ధర లభించక వుండే పంటలను కూడా ప్రాసెసింగ్ చేయడానికి వీలుగా వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ కంపెనీ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాసెసింగ్ చేసిన వెంటనే ఆయా పంటలను వివిధ కంపెనీలకు సరఫరా చేస్తారు. కర్మద్‌లో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్‌లో సోలార్ డ్రైయర్‌ల ద్వారా ఉల్లిపాయల ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎండిపోయిన ఉల్లిపాయలను సుగంధ ద్రవ్యాల కంపెనీలకు అందిస్తారు.దీంతో తమ జీవితాలు ఆర్థికంగా బాగుపడ్డాయని, రోజుకు 1,500 రూపాయలు సంపాదిస్తున్నామని మహిళలు తెలిపారు.