ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచం మెచ్చుకుంది : అమిత్ షా

ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పహల్గాం దాడితో పాటు అన్ని హద్దలూ దాటిని ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి, వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిందన్నారు. దేశ రాజధానిలో జరిగిన 22వ బీఎస్ఎఫ్ పురస్కార కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ను ప్రస్తావిస్తూ భారత సైన్యాన్ని ప్రశంసించారు. ఆపరేషన్ లో భారత సైన్యం, బీఎస్ఎఫ్,ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అద్భుతంగా పనిచేశాయని, ప్రధాని మోదీ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతం అయ్యిందన్నారు. పాక్ లో వున్న ఉగ్రస్థావరాలను భారత్ బయటపెట్టిందని, దాడులు చేసిందని, దీంతో పాక్ ఉగ్రవాదుల్ని పోషిస్తుందన్న విషయం మరోసారి ప్రపంచానికి తేటతెల్లం అయ్యిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ ని ప్రపంచం అంతా మెచ్చుకుందన్నారు.
అయితే బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థలు అందించిన కచ్చితమైన సమాచారం, త్రివిధ దళాల ప్రదర్శన వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యిందని ప్రకటించారు. పాకిస్తాన్ భారత్ పై క్షిపణులు ప్రయోగించిన సమయంలో దేశాన్ని కాపాడటంలో బీఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. బంగ్లాదేశ్ తో సహా అంతర్జాతీయ సరిహద్దులను కాపాడటంలో బీఎస్ఎఫ్ పాత్ర ఎంతో వుందని మెచ్చుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో మతం అడిగి మరీ చంపడం అత్యంత దారుణమని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తొమ్మిది ఉగ్రవాద స్థారవాలను మాత్రమే భారత సైన్యం ధ్వంసం చేసిందని, ప్రజలను గానీ, సైనిక స్థావరాలను గానీ ముట్టుకోలేదని పునరుద్ఘాటించారు. కానీ పాక్ సైన్యం మాత్రం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై, ఉగ్రవాదానికి మద్దతిచ్చారని మండిపడ్డారు.
amith shah2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *