వాయుసేన, నౌకాదళాల శక్తి సామర్థ్యాలు పెంచేలా 4,106 కోట్లతో కీలక ఒప్పందం

వాయుసేన, నౌక దళాల శక్తి, సామర్థ్యాలను మరింత పెంచేలా భారత ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. భారత వాయు సేన కోసం ప్రత్యేకంగా పని చేసేలా ఓ శాటిలైట్‌ వ్యవస్థతోపాటు నౌకా దళం కోసం హెవీ వెయిట్‌ టార్పిడోలను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రూ.4,106 కోట్ల విలువైన ఒప్పందాలపై రక్షణ శాఖ సంతకాలు చేసింది. ఇందులో వాయు సేన కోసం జీశాట్‌-7సీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కోసం బెంగళూరుకు చెందిన నూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థతో రూ.2563 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది.

 

దేశీయంగా అభివృద్ధి చేసిన జీశాట్‌-7సీ ఉపగ్రహం ద్వారా భారత వాయుసేనలోని సమాచార వ్యవస్థ మరింత సురక్షితం, బలోపేతం అవుతుందని రక్షణ శాఖ పేర్కొంది. అలాగే, వరుణాస్త్ర టార్పిడోల కోసం హైదరాబాద్‌కు చెందిన భారత్‌ డైనమిక్స్‌తో రూ.1,543 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబోరెటరీ దేశీయంగా అభివృద్ధి చేసిన వరుణాస్త్ర టార్పిడోలను యుద్ధనౌకల నుంచి సముద్ర గర్భంలో ఉన్న జలాంతర్గాములపైకి ప్రయోగించేలా రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *