సేవా సంప్రదాయానికి ఆర్ఎస్ఎస్ ప్రతిబింబం : ఉప రాష్ట్రపతి
న్యూఢిల్లీ : మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రచించిన “A Century of Service – The RSS in 100 Acts of Seva” పుస్తకాన్ని భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం భారత ఉప రాష్ట్రపతి అధికారిక నివాసంలో జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్ యొక్క వందేళ్ల సేవా ప్రస్థానం, సామాజిక బాధ్యత మరియు దేశ నిర్మాణంలో దాని కృషిని ఈ పుస్తకం వివరిస్తుంది ఉప రాష్ట్రపతి అన్నారు. ‘సేవ’ భావన ఏ విధంగా నిరంతరం పరిణామం చెంది సామాజిక సేవగా మారిందో ఈ పుస్తకం వివరిస్తుందని ఆయన పేర్కొన్నారు. “సేవయే ధర్మం – అది ఒక కర్తవ్యం” అనే సూత్రాన్ని ఒక మౌలిక ఆదర్శంగా అభివర్ణిస్తూ, పేదలు, అట్టడుగు వర్గాలు మరియు కార్మికులు, మహిళలు, పిల్లలతో సహా సమాజంలోని వివిధ వర్గాలకు ఆర్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాలు చేరాయని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆహారం, మందులు, అత్యవసర సహాయాన్ని అందించడంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు పోషించిన పాత్రను కూడా ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.
అలాగే ఈ పుస్తకంలో వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ నిర్మాణం అనే అంశం కూడా వుందని రాధా కృష్ణన్ పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడుతూ.. దేశ నిర్మాణానికి దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత మరియు జాతీయ సమైక్యత అత్యవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ పుస్తకం కేవలం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ద కాలపు సేవా కార్యక్రమాల రికార్డుగానే కాకుండా, భారతదేశం, దాని సంస్కృతి, జాతీయ చైతన్యానికి సంబంధించిన సేవా సంప్రదాయాన్ని భావి తరాలకు చాటిచెప్పే విధంగా కూడా ఈ పుస్తకం నిలుస్తుందన్నారు.