‘‘దీనదయాళ్ భరోసా’’.. కొత్త నైపుణ్య శిక్షణ
దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన 2.0 వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మార్పులు రాబోతున్నాయి. దీని వల్ల గ్రామీణ యువతకు విశేష ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఈ సవరించిన కార్యక్రమాన్ని కేంద్రం 14 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో, అక్టోబర్ నెలలో 34,000 మందికి పైగా గ్రామీణ యువత ఉద్యోగ అవకాశాలతో కూడిన నైపుణ్య శిక్షణను ప్రారంభించారు.
అమలులో భాగంగా మొదటి దశలో 14 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో శిక్షణా బ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. శిక్షణా బ్యాచ్‌లు మొదలయ్యే సమయానికి శిక్షణా కేంద్రాలు, అమలు చేసే సంస్థలు మరియు డిజిటల్ వ్యవస్థలు సిద్ధంగా ఉండేలా చూసేందుకు, ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధతను కూడా కేంద్రం ఇప్పటికే సన్నాహాలు చేసింది.
అక్టోబర్ నెలలో మొత్తం 1,164 శిక్షణా బ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. వీటిలో 34,920 మంది గ్రామీణ యువత పాల్గొననున్నారు.అక్టోబర్‌లో చేపట్టే ఈ కార్యక్రమం, ఒక విస్తృతమైన నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగం. డిసెంబర్ 31, 2027 నాటికి ఈ 14 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 3,57,112 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఒడిశా, మిజోరాం, సిక్కిం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ మరియు బీహార్ సహా పలు రాష్ట్రాల గ్రామీణ యువకుల జీవితాలు ఈ పథకంతో మారనున్నాయి. ఈ సమీక్షలో అర్హులైన గ్రామీణ యువతను సమీకరించడానికి సంబంధించిన ఏర్పాట్లు, శిక్షణ లక్ష్యాల కేటాయింపు, ప్రాజెక్ట్ అమలు సంస్థల భాగస్వామ్యం మరియు శిక్షణ బ్యాచ్‌ల ప్రారంభం వంటి అంశాలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.DDU-GKY 2.0 పోర్టల్ ప్రకారం, 1,200కు పైగా ప్రాజెక్టుల పరిధిలో 5.6 లక్షల మంది గ్రామీణ యువతకు సంబంధించిన లక్ష్యాలను కేంద్రం నిర్దేశించింది.
అయితే.. ఈ పథకానికి సంబంధించిన యువతను ఎంపిక చేయడం, వారికి లక్ష్యాలు నిర్దేశించడం, వీటికి అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకు అప్పగించింది. మరోవైపు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు 50 శాతం, మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పిస్తూ సామాజిక సమ్మిళితత్వాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. గత దశాబ్దంలో ఉద్యోగ ఫలితాలు, నియామకం తర్వాత సహాయంపై ఈ పథకం మరింత దృష్టి పెట్టింది. శిక్షణ, ఉద్యోగ నియామకాలు, ఉపాధి స్థిరత్వం, నియామకం తర్వాత సహాయాన్ని బలోపేతం చేస్తూ మెరుగుపరిచిన డీడీయూ–జీకేవై 2.0 మార్గదర్శకాలను ప్రభుత్వం 2025 మేలో ప్రకటించింది. పరిశ్రమల అవసరాల ఆధారంగా విమాన, అంతరిక్ష రంగం, వ్యవసాయం, సౌందర్యం, ఆరోగ్య సంరక్షణ, హరిత ఉద్యోగాలు, వైద్యం, వస్త్ర రంగం సహా పలు విభాగాల్లో శిక్షణ అందించే అవకాశం సవరించిన విధానంలో ఉంది. గ్రామీణ నైపుణ్యాభివృద్ధిపై నిరంతర దృష్టికి అనుగుణంగా 2026–27 కేంద్ర బడ్జెట్లో డీడీయూ–జీకేవైకి ₹750 కోట్లు కేటాయించారు.
స్థానిక యువతను ఉద్యోగాలు ఇచ్చే సంస్థలతో అనుసంధానించేందుకు రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు మండలాలు, గ్రామపంచాయతీ స్థాయిలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తాయి. యువత నమోదు, వృత్తి మార్గదర్శనం, నియామక సంస్థల ధ్రువీకరణ, కౌశల్ పంజీ ద్వారా ఏడాదిపాటు ఉద్యోగ ఫలితాల పర్యవేక్షణ ఇందులో ఉంటాయి. ఉపాధికి అవసరమైన నైపుణ్యాలున్న యువత కోసం ప్రధానంగా ఈ మేళాలు నిర్వహిస్తారు. మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే డీడీయూ–జీకేవై శిక్షణ పొందిన అభ్యర్థులు కూడా వీటిలో పాల్గొనవచ్చు. గ్రామపంచాయతీ స్థాయి మేళాలో 100 మందికి, మండల స్థాయి మేళాలో 200 మందికి ఉద్యోగాలు కల్పించాలనే నిబంధనకు లోబడి, డీడీయూ–జీకేవై బడ్జెట్ నుంచి వరుసగా ₹50 వేల వరకు, ₹లక్ష వరకు నిధులు అందుబాటులో ఉంటాయి.
డీడీయూ–జీకేవై 2.0లో స్థిరమైన ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆరు నెలల ఉద్యోగ వ్యవధికి సహకరించేలా నియామకం తర్వాత 12 నెలలపాటు పర్యవేక్షణ ఉంటుంది. ఉపాధి కొనసాగింపునకు అందించే సహాయం ఇలా ఉంటుంది:
* ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఆరు నెలలపాటు నెలకు ₹1,270 చొప్పున మొత్తం ₹7,620 ఆర్థిక సాయం అందుతుంది.
* గరిష్ఠంగా 60 రోజుల ఉద్యోగ విరామంతో 365 రోజులపాటు ఉపాధిలో కొనసాగిన అభ్యర్థికి ₹5 వేల స్థిరత్వ ప్రోత్సాహకం లభిస్తుంది.
* ఉద్యోగంలో చేరిన 12 నెలల తర్వాత నైపుణ్యాలను పెంచుకునేందుకు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు అవకాశాలు కల్పిస్తారు. తద్వారా ఉపాధిలో కొనసాగడంతో పాటు వృత్తిపరంగా ఎదిగే అవకాశాలు మెరుగవుతాయి.
గ్రామీణ యువతలో నైపుణ్యాలు, ఉద్యోగ సామర్థ్యం, పారిశ్రామిక శక్తిని పెంచడం దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధికి కీలకం. డీడీయూ–జీకేవై 2.0 ద్వారా అవసరాలకు వేగంగా స్పందించే, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనిచేసే, ఫలితాలపై దృష్టి పెట్టే నైపుణ్య శిక్షణ వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాలు గ్రామీణ యువతను ఉద్యోగాలకు సిద్ధం చేయడంతో పాటు సుస్థిర జీవనోపాధికి సహకరిస్తాయి. నాణ్యమైన శిక్షణ, పరిశ్రమలతో భాగస్వామ్యం, అవసరాలకు అనుగుణమైన సహాయంపై నిరంతరం దృష్టి పెడితే నైపుణ్యాలను దీర్ఘకాలిక జీవనోపాధిగా మార్చవచ్చు. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యం, సాధికారత, స్వావలంబన కలిగిన గ్రామీణ శ్రామిక శక్తిని నిర్మించే దిశగా డీడీయూ–జీకేవై 2.0 కీలక అడుగు. దేశాన్ని ప్రపంచ ఆర్థిక, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే వికసిత భారత్–2047 లక్ష్యానికీ ఈ పథకం తోడ్పడుతోంది.