కడు పేదరికం… కూరగాయలు అమ్మి.. చదువుతూ… దేశంలో ప్రసిద్ధ వైద్యురాలిగా గుర్తింపు

అత్యంత సాధారణమైన వస్త్రాలే. మామూలు చెప్పులే ధరిస్తారు. అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించారు. చాలా కష్టాలు పడ్డారు. ఓ దళిత కుటుంబంలో, మురికివాడలో జన్మించారు. అసలు కలలను సాకారం చేసుకోవడమే గగనం అన్న నేపథ్యం నుంచి వచ్చారు. కానీ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత మంచి వైద్యురాలిగా పేరు గడించారు. కర్నాటక కేన్సర్ సొసైటీలో ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. తల్లి మంగళసూత్రం అమ్మి, తండ్రి ఆయన్ను డాక్టర్ చదివించారు. ఆమె కూడా అంతే కష్టంగా చదువుకున్నారు. చివరికి కేన్సర్ చికిత్స రంగంలో అగ్రగామి అయ్యారు. ఆమెయే డాక్టర్ విజయలక్ష్మి. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజయలక్ష్మి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆమె జీవిత ప్రయాణం అందరికీ స్ఫూర్తిమంతం.

 

కర్నాటకలోని అత్యంత నిరుపేద, దళిత కుటుంబంలో డాక్టర్ విజయలక్ష్మి దేశ్మనే జన్మించారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన రొమ్ము కేన్సర్ చికిత్సలో పేరు గడించారు. 70 ఏళ్ల విజయలక్ష్మి దేశ్మానే భారత్ లోనే అత్యంత ప్రసిద్ధమైన ఆంకోసర్జన్. బెంగళూరులోని కిద్వాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి డైరెక్టర్‌గా ఉన్నారు.అలాగే ఐఐటీ కొట్టాయం చైర్ పర్సన్ గా, బెంగళూరులోని అబలాశ్రమం అధ్యక్షురాలిగా కూడా వున్నారు. ఓ వైపు వైద్యురాలిగా పనిచేస్తూనే, మరో వైపు సామాజిక సేవ కూడా చేస్తున్నారు. ఈ ఎన్జీవో బాలికలు స్వావలంబన సాధించడానికి ఉపయోగపడుతోంది.

ఆరుగురు సోదరీమణులు, ఓ సోదరుడు తర్వాత 1955 లో విజయలక్ష్మి జన్మించారు. ఏదో ఒక రోజు తన కూతురు అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని తండ్రి బాబురావు ప్రతిరోజూ కలలు కనేవారు. బాబూ రావు చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య రత్నమ్మ కూరగాయలు అమ్ముతూ సహాయపడేది. ఈ కుటుంబం మొత్తం మురికి వాడలోనే నివసించేది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా వుండేది. ఇతరులు వేసుకొని, వదిలిపెట్టిన బట్టలు, బూట్లు కాస్త బాగు చేసుకొని, వేసుకునేవారు. తల్లిదండ్రులు రోజూ సంపాదిస్తే గానీ.. రాత్రి భోజనం కూడా వుండేది కాదు.

డాక్టర్ విజయలక్ష్మి దేశ్మనే మాట్లాడుతూ… తమ కుటుంబం అత్యంత పేదవారని, నిరక్షరాస్యులని తెలిపారు. అయినా… తన పిల్లలు మాత్రం చదువుకొని, స్వావలంబన సాధించాలని నిత్యం కాంక్షించేవారని తెలిపారు. ఈ కారణంగానే తాను అత్యంత కష్టపడి విద్యనభ్యసించానని తెలిపారు. కన్నడ, మరాఠీ భాషలలో విద్యను అభ్యసించానని, చాలా కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు.కొన్ని సార్లు తాను కుటుంబానికి సాయం చేయడానికి తల్లితో కలిసి కూరగాయలు కూడా అమ్మానని, ఈ సమయంలోనే వివిధ హోదాలు, వివిధ స్థాయి వ్యక్తులను నిశితంగా గమనించినట్లు తెలిపారు. వీరందర్నీ ప్రేరణగా తీసుకొనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.

వారింట్లో సరైన విద్యుత్ వ్యవస్థ కూడా వుండేది కాదు. అయినా రాత్రి కూడా చదువును కొనసాగించేవారు. ఇంటర్ తర్వాత చదువుకోవడం అత్యంత ఖరీదు కావడంతో ఇక.. తాను చదువును కొనసాగించే అవకాశాలు లేవని భావించింది. కానీ.. ఆవిడ తండ్రి బాబురావు తన తల్లి తన మంగళసూత్రాన్ని అమ్మమని తండ్రి చేతిలో పెట్టింది. దీంతో విజయలక్ష్మి ఉన్నత చదువుల కోసం ఫీజులు చెల్లించారు.

ఇదే విజయలక్ష్మి కెరీర్ లో కీలక మలుపుగా చెప్పుకుంటారు. నిజానికి ఎంబీబీఎస్ లో చేరిన తర్వాత కూడా కష్టాలు వెంటాడాయి. కనీసం ఆప్రాన్ కొనడానికి కూడా ఆమె దగ్గర డబ్బుల్లేవు. ల్యాబ్ అసిస్టెంట్ కి సంబంధించిన పాత ఏప్రాన్ ధరించి వెళ్లేవారు. అయినా.. ఎక్కడా నిరాశకు గురికాలేదు. దీనిని గమనించిన ఓ సీనియర్… వెంటనే విజయలక్ష్మికి ఏప్రాన్ కొనుక్కోడానికి సహాయం చేశారు. అప్పుడు విజయలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ ఘటనను చాలా ఎదిగిన తర్వాత కూడా గుర్తు చేసుకునేవారు. సమాజంలోని వ్యక్తులు తనను ప్రతి అడుగులోనూ ఆదరించారని గుర్తు చేసుకునేవారు. ఇప్పటికీ వారందర్నీ తాను గుర్తుంచుకుంటూనే వుంటానని ప్రకటించారు.

అయితే ఎంబీబీఎస్ చదువు అంత సులభం కాదు. ఇంటర్ వరకూ కన్నడ మాధ్యమంలో సాగగా.. ఇకపై ఆంగ్లంలో చదువుకోవడం. దీంతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యారు. వెంటనే రాత్రింబవళ్లు కష్టపడి ఆంగ్లం నేర్చుకున్నారు. దీని తర్వాత విశ్వవిద్యాలయంలోనే మొదటి ర్యాంకు సాధించారు. ఆ తర్వాత ఇక.. వెనక్కి తిరిగి చూడలేదు. విజయాల పరంపరే.

ఆమె సేవా గుణం, ఆమె విషయ నిపుణత, చికిత్స విధానం చూసి.. అనేక అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి. 1998లో క్యాన్సర్ రంగంలో ఆమె చేసిన అత్యుత్తమ సేవలకు రోటరీ గ్రూప్ నుండి కలాష్ అవార్డు, 1999లో USAలోని అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూట్ నుండి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు,2005లో బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రిటీ పీస్ అండ్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ నుండి మహిళా శిరోమణి అవార్డు లభించాయి. ఆ తర్వాత కూడా చాలా అవార్డులు వచ్చాయి. తాజాగా.. 2025 లో పద్మ అవార్డు కూడా లభించింది.

ఓ వైపు వైద్య రంగంలో చేస్తూనే.. మరో వైపు సమాజంలోని వివిధ వ్యక్తులను చూసిన తర్వాత సామాజిక రంగంలో కూడా సేవలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2015 లో బెంగళూరులోని కిద్వాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ నుండి పదవీ విరమణ చేసిన తరువాత, ఆయన సామాజిక సేవ మరియు ఉచిత వైద్య చికిత్సకు తనను తాను అంకితం చేసుకున్నారు. అయితే.. ఎక్కడా అహంకారాన్ని ప్రదర్శించలేదు. తన వెనుక ఈశ్వరుడు వున్నాడని, ఆయనే అన్నీ చేయిస్తున్నాడని, తాను ఓ మాధ్యమం మాత్రమేనని తెలిపారు. నెలలో 15 రోజులు వైద్య సేవలు.. మరో 15 రోజులు సామాజిక సేవలో వుంటారు. బెంగళూరులో నిరుపేద యువతుల కోసం వున్న అబలాశ్రమ్ కి చైర్ పర్సన్ గా కూడా వుంటూ.. సేవలందిస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *