బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాల్సిందే : జగద్గురు పీఠాలు
బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసకర దాడులపై మన దేశంలోని నాలుగు జగద్గురు శంకరాచార్య పీఠాల పీఠాధిపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన డిబేట్ లో నాలుగు పీఠాల పీఠాధిపతులు డిబేట్ లో పాల్గొని, మార్గదర్శనం చేశారు. ఇలా నాలుగు పీఠాల పీఠాధిపతులు టీవీ చర్చలో పాల్గొనడం ఇదే ప్రథమం.
ఈ సందర్భంగా దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ సంఘటితంగా వుండాలని పిలుపునిచ్చారు. ఇది అత్యంత ఆవశ్యకమని పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆత్మ రక్షణ కోసం భారత్ లో వున్న హిందువులు, ఇతర దేశాల్లో వున్న హిందువులందరూ సంఘటితమై ప్రయత్నం చేయాలన్నారు. ఈ ప్రయత్నంలో శృంగేరీ శారదా పీఠం కూడా వెన్నుదన్నుగా వుంటుందన్నారు. హిందువుల విషయంలో భారత ప్రభుత్వం పక్షాన కూడా చర్యలుండాలని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా విదేశాల్లో అత్యంత కఠిన పరిస్థితుల్లో వున్న హిందువుల రక్షణ విషయంలో మరింత రక్షణ కల్పించాలని సూచించారు. హిందువులందరూ జాగృతం కావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. సనాతన ధర్మంలో వున్న అన్ని సంప్రదాయాల వారు కూడా భగవంతుని కృపను పొంది, తమ జీవనాన్ని సార్థకం చేసుకోవడానికే వున్నారన్నారు.
ఎప్పటి వరకైతే హిందువులంతా సంఘటితంగా వుంటారో, సనాతన ధర్మం గురించి ఆలోచిస్తారో అప్పుడు ఎవరూ హిందువుల్ని ఏమీ చేయలేరని ప్రబోధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయినా, రాబోయే సమయంలోనైనా సంకట పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించి అడుగులు వేయాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దేశంలో వున్న సనాతన ధర్మీయులు గానీ, విదేశాల్లో వున్న సనాతన ధర్మీయులు కఠిన పరిస్థితుల్లో వున్నారని, అతి త్వరలోనే ఆ సంకటాల నుంచి విడివడి, సుఖమయ జీవనం సాగాలని విధుశేఖర భారతీ మహా స్వామి వారు ఆశీర్వదించారు.
జ్యోతిర్మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అవిముక్తేశ్వరానంద మహా స్వామి వారు
ప్రస్తుతం హిందువులకు కఠిన సమయం నడుస్తోందని, బంగ్లాదేశ్ లో హింసకు గురవుతున్న హిందువుల భద్రత విషయంలో భారత ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వేలాది మంది బంగ్లాదేశీయులు భారత్ లో కూడి నివసిస్తున్నారని, ఆ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అస్సలు మరిచిపోవద్దని చురకలంటించారు. బంగ్లాదేశ్ హిందువులకు జరుగుతున్న అన్యాయం పట్ల ఎంతో బాధపడుతున్నామని, తీవ్రంగా ఆందోళన కూడా చెందుతున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ హిందువులకు ప్రభుత్వం నివసించడానికి స్థలం, కావల్సిన భద్రత కల్పిస్తే.. వారికి అవసరమే ఆహారం ఇతరత్రా అవసరాలను తాము చూసుకుంటామని, ప్రభుత్వంపై అస్సలు భారం పడనివ్వమని ఆయన హామీ ఇచ్చారు.
భారత దేశం సనాతన ధర్మానికి కేంద్ర బిందువు అని, బంగ్లాదేశ్ హిందువులకు భారత ప్రభుత్వం తగిన రక్షణ, హామీ ఇవ్వాలన్నారు. అక్కడ జరుగుతున్న అకృత్యాలను తట్టుకోలేక హిందువులు భారత సరిహద్దుల వైపు వస్తున్నారని, కానీ…అక్కడ వారిని అడ్డుకుంటున్నారన్నారు. వారికి ప్రవేశం వుండదా? అని ప్రశ్నించారు. శరణార్థుల రూపంలో అయినా వారిని రానివ్వాలన్నారు. వారు భారత్ లో ఆశ్రయం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక దృష్టి కోణంలో చూసుకుంటే అక్కడి వారు ఇక్కడి వారు ఒకటేనని, కేవలం రాజకీయ కారణాలతోనే వేరయ్యామన్నారు. భారత దేశం హిందువులకు కేంద్రమని, ప్రపంచంలోని ఏ హిందువుకైనా ఆపదలు వస్తే.. భారత్ కి తిరిగి వెళితే.. తమకు రక్షణ లభిస్తుందన్న ఆశాభావంతో వుండాలన్నారు. ఇలాంటి సంకట పరిస్థితుల్లో హిందువులు వచ్చి, తిరిగి వెళ్లే విధంగా సదుపాయం వుండాలని సూచించారు.
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు
ప్రాచీన భారతంలో పూర్వం బంగ్లాదేశ్ భాగంగా వుండేదని, విభజన కారణంగా జరిగిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని కంచి పీఠాధిపతులు అన్నారు. బంగ్లాతో ఆయుర్వేదం, శక్తిపీఠాల సంబంధం మనకు వుందని గుర్తు చేశారు. ఈ విషయాలతో పాటు చారిత్రక ధృక్కోణంలో 1905 లో బెంగాల్ మొదటి విభజన, అప్పటి తూర్పు పాకిస్తాన్ మరియు దాని ప్రస్తుత రూపం బంగ్లాదేశ్ గా ఏర్పడం గురించి మాట్లాడారు. అలాగే దేశ విభజనను వ్యతిరేకిస్తూ కంచి మహా స్వామి వారు అప్పట్లో ఏం మాట్లాడారో కూడా ఉటంకించారు. అలాగే జగద్గురు జయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు ఢాకాలో పర్యటించిన పర్యటనను కూడా గుర్తు చేసుకున్నారు. అలాగే వారు 2010 లో ఢాకేశ్వరీని సందర్శించిన విషయాలను కూడా తెలియజేశారు. ఇప్పటికీ అక్కడ శంకరాచార్య గేట్ అని వుందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో హిందువులు తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, అలా మైనారిటీలను రక్షించడానికి కృషి చేయాలని సూచించారు.
అలాగే బంగ్లాదేశ్ లో వున్న హిందూ దేవాలయాలను రక్షించడానికి కూడా ప్రభుత్వం చేయగలిగినదంతా చేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం హిందూ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను తెలుపుతూ… విభజన తర్వాత నోఖలీ దురాగతాలపై మహా స్వామి వారు ఏం మాట్లాడారో గుర్తు చేశారు. బలవంతంగా మతం మారిన వారు తమ మతానికి తాము దూరమయ్యామని బాధ పడొద్దని, అలాంటి పరిస్థితులే తలెత్తితే శాస్త్రాలు తగిన ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పాయన్నారు. బంగ్లాదేశ్ సాంస్కృతిక కోణంలో, మతపరమైన దృక్కోణంలో కూడా ఎంతో ముఖ్యమైందని, హిందువులకు ఇది ఎంతో గర్వకారణమన్నారు. అందుకే అక్కడి వారి గురించి ఇంత తపన పడుతున్నామన్నారు. గతంలో అక్కడ 27 శాతం మంది హిందువులుంటే.. ఇప్పుడు కేవలం 9 శాతమే వున్నారని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలను బాగా చూసుకోవాలని, అక్కడ శాంతి నెలకొనాలన్నారు. భారత ప్రభుత్వం అక్కడి హిందువులకు రక్షణగా నిలవాలని శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు సూచించారు.
ద్వారకా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వతీ
పాక్, అఫ్గన్ లో పరిస్థితులు ఎలా వున్నాయో బంగ్లాదేశ్ కూడా అలా అయిపోయిందని, దీనిని హిందువులు గుర్తించాలని సదానంద సరస్వతీ మహా స్వామి వారు అన్నారు. అఫ్గన్ లో హిందువులు ఎంతటి కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో.. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అలాగే తయారైందన్నారు. అక్కడి ప్రభుత్వాల్లో, రాజకీయ నేతల మధ్య వైరుధ్యాలు వుండొచ్చని, కానీ.. హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. అఫ్గన్, ఇరాన్ లో కూడా ఇలాగే వుందని, అది ఇప్పుడు బంగ్లాదేశ్ కి పాకిందని, ప్రభుత్వంతో ఏమైనా విభేదాలుంటే… దానిని హిందువులపై ఎందుకు చూపిస్తున్నారని, అక్కడ హిందువులు నివసిస్తే తప్పేంటని నిలదీశారు. హిందువులను వెంటాడి వేటాడి ఎందుకు చంపుతున్నారన్నారని, దేవాలయాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు.
భారత ప్రభుత్వం వెంటనే అక్కడి వారితో మాట్లాడి, దీనికో పరిష్కారం కనుగొనాలని సూచించారు. బంగ్లాదేశ్ లో షరియా చట్టం తేవడానికే ఇదంతా జరుగుతోందని ద్యోతకమైపోతుందని నిర్మొహమాటంగా అన్నారు. భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతలు ఓచోట కూర్చొని, దీనికి పరిష్కారం కనుగొని, అక్కడి మైనారిటీలకు ముఖ్యంగా హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే ఇదో ఉదాహరణగా మిగిలిపోయి, ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తే ప్రమాదం వుందని హెచ్చరించారు. నాలుగు పీఠాల శంకరాచార్యులది ఈ విషయంలో ఒకే అభిప్రాయమని, అందరి సూత్రాలూ ఒక్కటేనన్నారు. తామంతా హిందువుల గురించే ఆందోళన చెందుతున్నామని, సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.