60 వేల చెట్లు నాటి… ప్రకృతిని కాపాడుతున్న ఉపాధ్యాయుడు

వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. సమతౌల్యత కూడా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ దినోత్సవం రోజునే మొక్కలు నాటడం, ఉపన్యాసాలివ్వడం పరిపాటిగా మారిపోయింది. కానీ కొందరు పర్యావరణ ప్రేమికులు మాత్రం అత్యంత నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ పర్యావరణ ప్రేమికులుగా మారుతున్నారు. పర్యావరణాన్ని, ప్రకృతిని, చెట్లను తమ కంటకి రెప్పలా కాపాడుకుంటూనే వున్నారు. ఏ ప్రచారాన్నీ ఆర్జించడం లేదు. ఇలాంటి కోవలోకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుద్ధేశ్వర్ రాయ్ వస్తారు.

బుద్ధేశ్వర్ రాయ్ అసోంకి చెందిన వ్యక్తి. బొంగైగావ్ లోని తులుంగియా గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఓ వైపు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దూనే, పర్యావరణాన్ని కాపాడటం అన్న దానిని ఓ మిషన్ గా పెట్టుకొని, ముందుకు సాగుతున్నారు. వృక్ష ప్రేమికుడిగా.. నిశ్శబ్దంగా, ప్రచారానికి దూరంగా వుంటూ 24 సంవత్సరాలలో ఏకంగా 60 వేల మొక్కలను నాటారు. ఇలా చేయడం ద్వారా ప్రకృతిపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.

బుద్ధేశ్వర్ రాయ్ ది అత్యంత పేద కుటుంబమే. ఆర్థిక ఇబ్బందులున్నా… సమాజానికి ఏదో చేయాలన్న తపన మాత్రం అత్యంత బలంగా వున్న వ్యక్తి. పైగా వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం. దీంతో ప్రకృతిని కాపాడి, భావి తరాలకు మంచి వాతావరణాన్ని, చెట్ల సంపదను ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారు. దీంతో 2001 నుంచి మొక్కలు నాటడాన్ని ప్రారంభించారు. తనకు వచ్చే నెల జీతంలో రహదారుల వెంట, గ్రామాల్లో, పాఠశాలల్లో, బంజరు భూముల్లో మొక్కలు నాటడం ప్రారంభించారు. ఉద్యోగం రాక మునుపు ఇదే పనిలో వుండేవారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా.. పాఠశాల సమయం కాకుండా.. మిగతా ఖాళీ సమయాల్లో మొక్కలను నాటడమే పనిగా వున్నారు. వీటిని తన కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు.

రఖల్దుబి నుంచి తులుంగియా వరకు వున్న జాతీయ రహదారికి ఇరువైపులా 12,000 కంటే ఎక్కువ పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. చాలా పెద్ద వృక్షాలయ్యాయి. అయితే 2019 లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు లైన్ల రోడ్ విస్తరణ అంటూ ఈ చెట్లన్నింటినీ నరికేసింది. ఈ ఘటన బుద్ధేశ్వర్ కి తీవ్ర వేదన మిగిల్చింది.

తనకు బాగా కోపం కూడా వచ్చిందని తెలిపారు. ఆ చెట్లను పెంచడానికి నాకు సంవత్సరాలు పట్టింది. కానీ.. NHAI అధికారులు మాత్రం రాత్రికి రాత్రే వాటిని నరికేశారు. బాధపడ్డాను. కానీ అక్కడే ఆగిపోలేదు. మళ్లీ అదే అకుంఠిత సంకల్పంతో మళ్లీ మొక్కలు నాటడం ప్రారంభించాను’’ అని బుద్ధేశ్వర్ తెలిపారు.బుద్ధేశ్వర్ తిరిగి తన లక్ష్య సాధనలో మునిగిపోయారు. ఏమాత్రం ప్రతిఫలాపేక్ష లేకుండా, తన సొంత డబ్బుతో అదే రహదారి వెంబడి మొక్కలు నాటడం ప్రారంభించారు. అత్యంత శ్రద్ధగా ఈ పనిచేస్తుంటారు.

అంతేకాకుండా కరువు కాలంలో వీటన్నింటికీ నీరు పోస్తారు. పశువులు తినకుండా కూడా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా చేస్తారు. ప్రతి రోజూ వాటి పెరుగుదలను పర్యవేక్షిస్తారు. ఉపాధ్యాయ విధులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే ఈ పని చేస్తారు. బుద్దేశ్వర్ చేస్తున్న పనిని ఆ ప్రాంతంలోని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు గమనించారు. అభినందించారు. స్థానికంగా వుండే యువజన సంఘాలు కూడా ఇప్పుడు ఆయనకు తోడ్పాటునందిస్తున్నాయి. దీంతో చెట్ల పెంపకం మరింత వేగం పుంజుకుంది.

ఈ ప్రకృతి ప్రేమికుడు చేస్తున్న పని విషయంలో ప్రభుత్వం నుంచి గుర్తింపు రాలేదు కానీ.. 2018 లో ‘‘నృత్యం’’ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఆయనకు ‘‘బ్రిక్ఖబాంధవ్’’ (చెట్ల స్నేహితుడు) అన్న అవార్డుతో ఘనంగా సత్కరించింది. బుద్దేశ్వర్ నుంచి అందరూ స్ఫూర్తి పొందాలని కూడా పిలుపునిచ్చింది.ఈ సందర్భంగా బుద్ధేశ్వర్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది వారు చేసే పనికి విలువే ఇవ్వరు. పోస్టర్లు, బ్యానర్లు, పేపర్ లో వార్తల కోసం, ప్రచారం కోసం చెట్లు నాటుతారు. అలా చేయవద్దని కోరుకుతన్నాను. చెట్లు జీవులు. వాటిని గౌరవంగా చూసుకుందాం. ఎవ్వరు చూడకపోయినా.. చెట్లను పెంచుదాం.’’ అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *